Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ కమిషన్ కాల పరిమితి ఫిబ్రవరిలో ముగిసినా నేటి వరకూ కొత్త కమిషన్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు నోటీసులూ ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఎం.సత్యం వేసిన పిల్లో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సోషల్ వెల్ఫేర్ చీఫ్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్లకు నోటీసులను జారీ చేసింది.
తుక్కుగూడ చైర్పర్సన్ ఎన్నికపై పిల్ మూసివేత
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మునిసిపల్ చైర్మెన్‌గా మధసూదన్ ఎన్నిక చట్ట వ్యతిరేకమని దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ మూసేసింది. చట్ట వ్యతిరేకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కే. కేశవ్‌రావు, ఎమ్మెల్సీలు మల్లేశం, కె.జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఓట్లు వేసినందు వల్లే టీఆర్ఎస్ పార్టీకి చెందిన మధుసూదన్ గెలిచారని లక్ష్మణ్ మరొకరు వేసిన పిల్లో ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. చైర్పర్సన్ ఎన్నికపై అభ్యంతరాలుంటే ఎన్నికల పిటిషన్ వేసుకోవచ్చునని చీఫ్ జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేయడం వల్లే మధుసూదన్ గెలవడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు.
పాఠశాలల్లో ఫీజుల వసూలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
ప్రయివేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులను ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫీజుల నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ సాయినాథ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజ శేఖర్ రెడ్డి లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ట్యూషన్ ఫీజు పేరుతో ఇతరత్రా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు లేవనీ, అధికంగా వసూలు చేసిన ఫీజులో 40 శాతం కరోనా ఫండ్ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ, తిరుపతిరావు కమిటీ రిపోర్టును వెల్లడించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర విద్యా శాఖలతోపాటు సీబీఎస్ఈసీ, రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది.
తీన్మార్ మల్లన్న బెయిల్ కేసు వాయిదా
మేడిపల్లి పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పెట్టిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని బీజేపీకి చెందిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) హైకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారించి ప్రతివాదులైన పోలీసులకు నోటీసులిచ్చారు. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. నయనత్ అశోక్ ఇచ్చిన ఫిర్యాదుపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసిన విషయం విదితమే.
రిజిస్ట్రేషన్లలో సమస్యలపై తీసుకున్న చర్యలేంటి?
రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు
ధరణి వల్ల భూముల రిజిస్ట్రేషన్లలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. సాగు చేసే భూముల రిజిస్ట్రేషన్లపై ఎదురవుతున్న సమస్యలపై కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. ధరణి పోర్టల్‌లో సమస్యలపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఇంద్రప్రకాశ్ వేసిన పిల్‌ను విచారించిన హైకోర్టు.. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి, సీసీఎల్ఏలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. ధరణి అమల్లోకి వచ్చాక పాత పద్ధతిలో భూముల రిజిస్ట్రేషన్లు చేయడం లేదనీ, రైతులు పలు సమస్యలను ఎదర్కొంటూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సివస్తోందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ధరణిపై పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయనీ, వాటన్నింటినీ కలిపి విచారణ చేయాలని ధర్మాసనాన్ని కోరారు.