Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 ఏండ్లకే ఓటు హక్కు కల్పించిన మహానేత : రాజీవ్ సద్భావన సభలో వీరప్పమొయిలీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్న ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ చెప్పారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎంతో దూరదృష్టితో 18 ఏండ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. యువ ప్రధానిగా ఉండి దేశం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు. మంగళవారం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఆధ్వర్యంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అధ్యక్షతన చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభ లో ఆపార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కాం గ్రెస్ జెండాను ఎగురవేశారు. అనంతరం సర్వమత ప్రార్థ నలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరప్పమొయిలీకి 'రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు'ను అందజేశారు. ముస్లిం సోదరులకు ఈద్ మిలాప్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీరప్ప మొయిలీ మాట్లాడుతూ దేశ కోసం త్యాగాలు చేసిన రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీని మరువలేమన్నారు. అస్సాం, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాలు సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే...ఆయా సమస్యలను పరిష్కరించిన నేత అని కొనియాడారు. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడేందుకు కృషి చేశారని తెలిపారు. నేడు దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే...అందుకు మహనీయులు చేసిన త్యాగాలే కారణమని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఐదేండ్ల పరిపాలన ఓ స్వర్ణయుగంలా సాగిందని గుర్తు చేశారు. అభివృద్ధి, ఐక్యత, శాంతి, మత సామరస్యాన్ని కాపాడుతూ ఆయన పాలన సాగించారని వివరించారు. దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు వీలుగా అవినీతి నిరోధక చట్టాన్ని, రాజకీయాల్లో విలువలను పెంచేందుకు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఫిరాయింపుల చట్టం మనుగడలో ఉన్నప్పటికీ మోడీ సర్కారు ప్రజాప్రతినిధులను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నదని విమర్శించారు. అవినీతి నిర్మూలించేందుకు యూపీఏ పాలనలో లోక్‌పాల్ బిల్లును తీసుకొస్తే...దాన్ని అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు. లోక్‌పాల్ కావాలంటూ పోరాడిన సంతోష్‌హెగ్డే, అన్నా హజారే ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కుల, మతాలను రెచ్చగొట్టి ఒక పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తే...దానికి భిన్నంగా దేశ సమైక్యత కోసం రాజీవ్‌గాంధీ ప్రాణాలిచ్చారని గుర్తు చేశారు. ప్రాంతాలు, మతాల ముసుగులో కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చి విర్రవీగుతున్నాయనీ, కర్ణాటక సీఎంగా మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వీరప్పమొయిలీ అని కొనియాడారు. వైఎస్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్, ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, మాజీ మంత్రులు పొన్నాలలక్ష్మయ్య, జె గీతారెడ్డి,వినోద్, సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, వి హనుమంతరావు, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.