Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వి రామరాజు జలవిహార్ తరఫున ఒక కిలో బంగారాన్ని అందజేస్తామని ప్రకటించారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినందుకు ఆయన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రణీత్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోల బంగారం, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కామిడి నర్సింహారెడ్డి 2 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.
తాపడానికి 'మెఘా' ఆరు కేజీల బంగారం
తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఆరు కేజీల బంగారం సమర్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మెఘా డైరెక్టర్ బి. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమనీ, ఇందులో పాలుపంచుకోవడం అదృష్టమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి ముఖ్యమంత్రి ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.