Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్‌కు ఆశా, మెడికల్ యూనియన్ల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ములుగు జిల్లాలో భర్తీ చేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎం పోస్టుల్లో ఆశాలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర కార్యదర్శి కె.యాదానాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణకు వినతిపత్రం సమర్పించారు. ఆ జిల్లాలో దాదాపు 45 మంది ఆశాలు ఇప్పటికే ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) పూర్తి చేసి ఏఎన్ఎంలుగా పని చేసేందుకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు.15నుంచి20 ఏండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పేదలకు, గర్భిణీలకు ఆరోగ్య సేవలందిస్తూ అనుభవం సంపాదించారని చెప్పారు. కేవలం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు చాలీ చాలనీ జీతంతో మంచి అవకాశం వస్తుందనే ఆశతో జీవనం సాగిస్తున్నారనీ, వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలని పేర్కొన్నారు. అంగన్వాడీ, వీఆర్ఏ తదితర రంగాల్లో పదోన్నతుల సౌకర్యం ఉన్నట్టే ఆశాలకు కూడా కల్పించాలని కోరారు. వయస్సును, ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) పూర్తి చేసిన సంవత్సరానికి పరిగణనలోకి తీసుకుని అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జ్వర సర్వేలు చేసినప్పటికీ ప్రతిఫలంగా పారితోషికాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.