Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదం తొలగిపోలేదు..
- రెండో డోసు తప్పనిసరి : డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు....ప్రజలను కోరారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా పూర్తిగా కనుమరుగైందనే అవగాహనా రాహిత్యం, ఇక ఏమి కాదనే అపోహలతో చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క డోసు కూడా తీసుకోని వారు 69 లక్షల మంది తెలిపారు. 36 లక్షల మంది గడువు దాటినా రెండు డోసు తీసుకోకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. ప్రతి రోజూ 10 లక్షల మందికి టీకాలిచ్చే సామర్థ్యముందనీ, రాష్ట్రం వద్ద 50 లక్షల డోసుల నిల్వ ఉందనీ, అయినా మూడు లక్షలు దాటటం లేదని తెలిపారు. కేంద్రం నుంచి ప్రతి రోజూ నాలుగైదు లక్షల డోసులు సరఫరా అవుతున్నాయని వెల్లడించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో 75 శాతం మందికి మొదటి డోసు ఇవ్వగా, రెండో డోసు కేవలం 39 శాతం మందే తీసుకున్నారని చెప్పారు. ప్రతి రోజు సరాసరిగా 200-250 కొత్త కోవిడ్-19 కేసులు వస్తుండగా అందులో 60 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారనీ, మరో 30 శాతం మంది ఒక్క డోసు తీసుకున్నవారనీ, మిగిలిన ఐదు నుంచి 10 శాతం మంది రెండు డోసులు వేయించుకున్న వారు ఉంటున్నారని వివరించారు. అయితే రెండు డోసులు తీసుకున్న వారికి కరోనా సోకినా ఆస్పత్రిలో చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుందనీ, మరణాలు లేనేలేవని తేల్చి చెప్పారు.
36 లక్షల మందితో ప్రమాదం
ఒక డోసు తీసుకుని, రెండో డోసు గడువు దాటినా తీసుకోని వారిలో యాంటీబాడీలు కనుమరుగవుతున్నాయని డీహెచ్ తెలిపారు. వీరితో ప్రమాదం పొంచి ఉందన్నారు. కరోనా విషయంలో హెర్డ్ ఇమ్యూనిటీ పని చేయదనీ, వ్యాక్సిన్ వేసుకున్న వారు సురక్షితంగా ఉంటారని తెలిపారు. పండుగల సమయాల్లో కేసులు పెరగలేదని స్పష్టం చేశారు.
మూడు వారాల్లో పిల్లలకు వ్యాక్సిన్
12 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మరో రెండు నుంచి మూడు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కొనసాగుతున్నదని చెప్పారు.
బస్తీ దవాఖానాల్లోనూ వ్యాక్సిన్
జీహెచ్ఎంసీ పరిధిలో రెండో డోసు తీసుకోవాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో సౌకర్యాలను పెంచాలని నిర్ణయించినట్టు శ్రీనివాసరావు తెలిపారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలతో పాటు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ డీఎంహెచ్ఓను ఆయన ఆదేశించారు.