Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాప్రస్థానం ప్రారంభసభలో వైయస్సార్ టీవీ అధ్యక్షులుషర్మిల
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రజల ఆశయాలను బతికించేందుకు పాదయాత్ర చేపడుతున్నట్టు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. వికారాబాద్ రోడ్డులోని చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్ సమీపంలో బుధవారం ప్రజాప్రస్థానం పాదయాత్రను ఘనంగా ప్రారంభించారు. అంతకు ముందు తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి హైదరాబాద్ నుంచి చేవెళ్లకు విచ్చేసిన వైఎస్ షర్మిలకు పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. సభాస్థలికి చేరుకున్న అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి షర్మిల మాట్లాడారు. తెలంగాణలో కిరాతక సీఎం పరిపాలన రాజ్యమేలుతుందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ అవినీతి పాలనను పాతి పెట్టేందుకు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేపడుతున్నామని తెలిపారు.
కులం, మతం పేరుతో తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీని తొందర్లోనే బొంద పెడతామన్నారు. కేసీఆర్‌కు అమ్ముడు పోయిన కాంగ్రెస్‌ను చీల్చిచెండాడుతామని హెచ్చరిం చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి వర్గానికి దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేండ్ల కాలంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పిన కేసీఆర్‌కు ఆ రైతులే తొందర్లో బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కౌలు రైతులు అసలు రైతులే కారని చెప్పిన గొప్ప సీఎం కేసీఆర్ అని ఆరోపించారు.
కరోనాతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఈ పాదయాత్రతో రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుంటామని ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని తెలిపారు. దివంగత వైఎస్సార్‌కు అచ్చి వచ్చిన చేవెళ్ళ నుంచి పాదయాత్ర చేపట్టారనీ, అదే ఆనవాయితీని కొనసాగిస్తానని వివరించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను మళ్లీ అమలు చేయాలంటే తెలంగాణలో వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. అనంతరం కందవాడ గ్రామంలో గ్రామస్తులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.