Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ సిగల్ ఇచ్చిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చింది. రెసిడెన్షియల్ హాస్టళ్లు, కాలేజీలు, స్కూళ్లను తెరవొద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. వాటిని తిరిగి తెరిచిన తర్వాత అక్కడి పరిస్థితులను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా మార్గదర్శకాలను అమలు చేస్తామన్న ప్రభుత్వ హామీని విధిగా అమలయ్యేలా చూడాలని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన ఎం.బాలకృష్ణ సవాల్ చేసిన పిల్‌పై విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. తెరుచుకున్న విద్యా సంస్థలన్నింటిలోనూ కరోనా గైడ్‌లైన్స్ అమలు అవుతున్నాయనీ, గురుకులాల్లో కూడా విద్యాబోధనకు అనుమతివ్వాల ని ప్రభుత్వం తరఫున ఏజీ బిఎస్ ప్రసాద్ కోరారు. గురుకులాల్లో పేదలు, బడుగు, బలహీనవర్గాలు, దళితులు, ఎస్టీలు ఎక్కువగా చదువుకుంటారనీ, వాళ్లకు హాస్టళ్లలో లభించే బలవర్ధక ఆహారం కూడా అందడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల మానసిక స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలనీ, విద్యార్థుల భవిష్యతును అర్ధం చేసుకుని గురుకులాలను తిరిగి ప్రారంభించాల్సి అవసరాన్ని గుర్తించాలన్నారు. ఇండియాలో పాఠశాలలు తెరవాలని యునెస్కో చెప్పిందన్నారు. ఏడాదిన్నర కాలంగా గురుకులాలు మూతపడ్డాయన్నారు. కరోనా పేరుతో విద్యార్థులు ఇండ్ల దగ్గరే ఉంటే చదువుకునే శక్తిని కూడా కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం లేదనీ, ఇప్పుడు మళ్లీ పౌష్టికాహారం అందితే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి పిల్లలకు వస్తుందన్నారు. కరోనా మార్గదర్శకాలను అమలు చేస్తేనే గురుకులాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ లాయర్ రవిచందర్ వాదించారు. పిల్లలకు వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. మూడో దశ కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలన్నారు.