Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో మోడీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం
- ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలేవి?
- సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా 3వ మహాసభలో డీజీ నర్సింహారావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు విమర్శించారు. హైదరాబాద్ మలక్‌పేట్‌లోని సంహిత కాలేజ్(అబ్దుల్ సత్తార్ ప్రాంగణం)లో బుధవారం జరిగిన సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా 3వ మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకొస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోడీ గొప్పలు చెప్పారని, ఏడేండ్ల కాలంలో 14 కోట్ల ఉద్యోగాలేవని ప్రశ్నించారు. దేశంలో 22 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కనీస వేతనం రూ.25 వేలు కావాలని కార్మికులు డిమాండ్ చేస్తుంటే మోడీ ప్రభుత్వం రూ.5 వేలుగా నిర్ణయించడం శోచనీయ మన్నారు. కరోనా కాలంలో ఉపాధి, విద్య, వైద్యం, కనీస వేతనాల్లేవని, ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిన ఘనత మోడీకే దక్కిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని చెప్పారు. దేశంలో పౌర, మానవ హక్కులను హరిస్తున్నారని, అందుకు లఖింపూర్‌లో రైతులను కారుతో తొక్కించిన ఘటనే నిదర్శనమని చెప్పారు. అఫ్ఘనిస్తాన్‌ను ఆగం చేసిన అమెరికాతో అంటకాగుతూ దేశాన్ని నాశనం చేయడానికి మోడీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 11మాసాలుగా రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీకి మూడిందని, యూపీ ఎన్నికల్లో బీజేపీ మటాష్ అవుతుందని ఓ రాష్ట్ర గవర్నర్ మాట్లాడటం బీజేపీ పతనం ఖాయమనేది తెలుస్తోందన్నారు. దేశానికి కేరళ ప్రభుత్వ విధానాలు ఆదర్శంగా ఉన్నాయని, కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉపాధి, ఉచిత విద్య, వైద్యం కల్పించిన ఘనత వామపక్ష ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాయల ఫకీర్‌లా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, ఓవైసీ నిర్లక్ష్యం కారణంగా పాతబస్తీకి మెట్రో రైలు ఆగిపోయిందన్నారు. పాతబస్తీలో ప్రజలకు ఉపాధి కరువైందని, విద్య, వైద్యం అందడం లేదని, కార్మికులకు కనీస వేతనాల ఊసేలేదన్నారు. పేదలకు డబుల్ అందకపోవడంతో అద్దె కట్టలేక గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీకెళ్లిన కేసీఆర్ మోడీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందులో భాగంగానే హుజూరాబాద్‌లో తమ అభ్యర్థి గెలిచేందుకు బీజేపీ సహకరించేలా ఒప్పందం చేసుకుని వచ్చారని విమర్శించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు కేసీఆర్ జై కొడుతున్నారని, రైతుల ఉద్యమం గురించి కేసీఆర్ ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
అంతకుముందు పార్టీ జెండాను సీనియర్ నాయకులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లక్ష్మమ్మ ఆవిష్కరించారు. అనంతరం జోగయ్య, అబ్దుల్ సత్తార్ చిత్రపటాలకు డీజీ నర్సింహారావు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి ఎన్.సోమయ్య పూలమాలలేసి నివాళలర్పించారు. తర్వాత కార్యదర్శి ఎన్.సోమయ్య నివేదిక ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో విఠల్, అబ్దుల్ సత్తార్, శశికళ, శ్రవణ్‌కుమార్, నాగేశ్వర్రావు, ఎం.బాలునాయక్ పాల్గొన్నారు.