Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 నుంచి ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు
- సహకరించేది లేదంటున్న ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు
- జవాబు, ఓఎంఆర్, హాజరు పత్రాలు తీసుకోని ప్రిన్సిపాళ్లు
- స్కాలర్షిప్, ఫీజు బకాయిలివ్వాలని డిమాండ్
- ఇంకా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరిగే ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ పరీక్షల నిర్వహణకు సహకరించేది లేదంటూ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలు తేల్చిచెప్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.315 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాపోతున్నాయి. ఇంకోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల హాల్‌టికెట్లపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదంటూ ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీనిపై తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తే ఎవరు బాధ్యత వహించాలని ఇంటర్ బోర్డును ప్రశ్నించింది. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నది. స్కాలర్షిప్, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నది. లేదంటే పరీక్షా కేంద్రాలను ఇచ్చేది లేదంటూ ప్రకటించింది. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,59,008 మంది హాజరు కాబోతున్నారు. వారి కోసం 1,458 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో 1,178 పరీక్షా కేంద్రాలు ప్రయివేటు జూనియర్ కాలేజీల్లోనే ఉన్నాయి. ఇంటర్ పరీక్షల కేంద్రాలు 81 శాతం ప్రయివేటు కాలేజీల్లోనే ఉండడం గమనార్హం. ఇప్పుడు పరీక్షలకు సహకరించేదిలేదంటూ టీపీజేఎంఏ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. జవాబుపత్రాలు, ఓఎంఆర్పత్రాలు, విద్యార్థుల హాజరు పత్రాలను డీఐఈవోలు, నోడల్ అధికారుల నుంచి ప్రయివేటు జూనియర్ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు తీసుకోలేదని సమాచారం. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు వాటిని తీసుకున్నట్టు తెలిసింది. ఎక్కువ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు తీసుకోలేదని సమాచారం. ఇది విద్యార్థుల భవిష్యత్తుతోపాటు పరీక్షల నిర్వహణపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదమున్నది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు. పరీక్షల నిర్వహణకు ఇంకా నాలుగు రోజులే సమయముంది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు అధికారులు, డీఐఈవో, నోడల్ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఇంకోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్), తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలెందుకని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.
పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు : గౌరి సతీష్, టీపీజీఎంఏ అధ్యక్షులు
రాష్ట్రంలోని 33 జిల్లాల డీఐఈవోలు, నోడల్ అధికారులను బుధవారం కలిసి ప్రయివేటు జూనియర్ కాలేజీల్లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీష్ చెప్పారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను తాము నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.315 కోట్ల స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం తప్పనిసరి చేయాలని కోరారు. జీవో నెంబర్ 112 ప్రకారం ట్యూషన్ ఫీజును పెంచాలని వివరించారు. పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాలు, ఓఎంఆర్, హాజరు పత్రాలతోపాటు ఇతర సామగ్రిని ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు తీసుకోలేదని చెప్పారు. తమ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించనందున పరీక్షల నిర్వహణకు సహకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం కచ్చితంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ ప్రధాన కార్యదర్శి జి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు పార్థసారధి, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.