Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూమరికల్ పద్ధతిలో మెరుగైన వాతావరణ ఫలితాలు
- నైరుతిరుతుపవనాల వల్లనే తెలంగాణలో ఎక్కువ వర్షాలు
- ఈ నెల 21, 22 తేదీల్లో ప్రత్యేక సామర్థ్యమున్న పిల్లలకు అవగాహనా కార్యక్రమాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏజెన్సీ ఏరియాల్లో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాలను మరింత విస్తరించాల్సిన అవసరముందనీ, ఆటోమెటిక్ రెయిన్గేజ్లను కూడా విస్తృతంగా స్థాపిస్తే వర్షపాత నమోదులో మెరుగైన ఫలితాలు వస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 18 నుంచి 24 వ తేదీ వరకూ వాతావరణ శాఖ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో గల వాతావరణ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరత్న మాట్లాడుతూ..75 ఏండ్ల స్వాతంత్రత్య వేడుకలను పురస్కరించుకుని వాతావరణంపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలు, యూనివర్సిటీ విద్యార్థులకు థర్మామీటర్లు, హైడ్రోమీటర్లు, రెయిన్‌గేజ్‌లు, ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు, రాడార్లు, గోదావరి, కృష్ణా నది పరివాహన ప్రాంతాల బులిటెన్లు, తదితరాల గురించి వివరించామని చెప్పారు. 21, 22 తేదీల్లో అంధ విద్యార్థులకు, విభిన్న సామర్ధ్యం గల పిల్లలకు వాతావరణ అంశాలపై వారికి అర్ధమయ్యేలా విడమర్చి చెబుతామన్నారు. 50 ఏండ్లలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ వాతావరణ బులిటెన్లు ఇవ్వడంలో ఎంతో అభివద్ది సాధించామన్నారు. న్యూమరికల్ పద్ధతిలో విశ్లేషించడం ద్వారా ఎప్పటికప్పుడు తాజా బులిటెన్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. ఆరుగంటలలో ఎనాలసిస్ చేసే దగ్గర నుంచి అరగంటలో రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుందో విశ్లేషణ చేసి ఇవ్వగలిగే స్థితికి చేరామన్నారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్లనే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నదని చెప్పారు. ఈఏడాది రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం రికార్డయిందన్నారు. మరో అధికారి శ్రీధర్ మాట్లాడుతూ..వాతావరణ పదజాలం గురించి వివరించారు. మేఘాలను 8 భాగాలు విభజించి ఒక్కో భాగాన్ని ఒక ఆక్టాగా గుర్తిస్తామనీ, దాని ఆధారంగానే వర్షాలు పడే అవకాశం ఎంత వరకు ఉందో చెబుతామని చెప్పారు. అరేబియా సముద్రంలో కంటే బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్నారు. అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనం, వర్షపాతం తీరు తెన్నుల గురించి వివరించారు. అధికారి శ్రావణి మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారిత వాతావరణ బుటిటెన్‌లను వారానికి రెండు సార్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. 1977 తర్వాత 132 అగ్రో క్లయిమెటికల్ జోన్ల విభజన జరిగిందనీ, 2007లో సాంకేతికంగా మరింత అభివద్ధి సాధించామని అన్నారు. విత్తనాలు ఎప్పుడు వేయాలి? వర్షపాతం ఎంత పడే అవకాశం ఉంది? గాలి వీచే దిశ ఆధారంగా ఎరువులు వెదజల్లడం, మందుల పిచికారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితరాంశాలను కూడా రైతులకు అర్థమయ్యేలా విడమర్చి చెబుతున్నామనిచెప్పారు. కనీసం మూడు రోజులు వరుసగా వర్షాలు పడితేనే విత్తనాలు వేయాలని రైతులకు సూచించారు.