Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఓడీ అనుమతి ఉంటేనే సమాచారం వెల్లడి
- సర్క్యులర్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఇప్పటికే పదివేలకుపైగా అర్జీలు పెండింగ్‌లో..
- సర్క్యూలర్ అమలైతే చట్టం స్ఫూర్తికి తీవ్ర విఘాతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రశ్నించడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారే గాదు రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారూ సహించడం లేదు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నది. పారదర్శక పాల న అంటూనే సమాచార హక్కు చట్టానికే తూట్లు పొడుస్తున్నది. ఆ చట్టంకింద అర్జీలుపెట్టుకున్న వారికి శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే సమాచారం ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సర్క్యూలర్ తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. ఆకమిషన్ విశ్వసనీ యతను, దానికున్న హక్కులను కాలరాస్తూరాష్ట్ర సర్కారు తన దుర్భిద్ధిని చాటుకున్నది. ఆ సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. మన దేశంలో సమాచార హక్కు చట్టం(రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు)-2005ను యూపీఏ-1 ప్రభుత్వం తీసుకొచ్చింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో సహా అన్ని రాజ్యాంగ సంస్థలు, యంత్రాగాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల చట్టాల ద్వారా స్థాపించిన సంస్థలన్నీ ఆర్టీఐ కిందకు వస్తాయి. ఆ చట్టంలోని రెండో షెడ్యూల్లో పేర్కొన్న ఇంటెలిజెన్స్, భద్రతా సంస్థలకు మాత్రం మినహాయింపు ఉంది. అయితే, ఈ సంస్థల్లో అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం మాత్రం చట్టం పరిధిలోకి వస్తుంది. తద్వారా దేశ పౌరులందరూ ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించిన డాక్యుమెంట్లను, ప్రభుత్వ పనులను తనిఖీ చేసే హక్కును ఈ చట్టం కల్పించినట్టయింది. ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు, కొన్ని సందర్భాల్లో 48 గంటల్లోపు అందివ్వాలని చట్టం స్పష్టంగా పేర్కొంది. సంబంధిత శాఖ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐఓ) 30 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషన్లను సంప్రదించవచ్చు. సమాచారం కోరే వ్యక్తి పూర్తిపేరు, చిరునామా ఉంటే చాలు ఏ ఫార్మాట్లో దరఖాస్తు చేసినా నిర్ణీత గడువులోపు సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో పీఐఓలపై జరిమానాలు విధించాలనే విషయాన్నీ చట్టం నొక్కిచెప్పింది.
పదివేలకుపైగా అర్జీలు పెండింగ్‌లోనే..చట్టం నిర్వీర్యానికి అడుగడుగునా కుట్రలే..
ప్రజలకు చేసే పనులపై సమాచారం ఇవ్వొద్దని కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా సమాచార హక్కు చట్టం కింద చేసుకన్న దరఖాస్తులను తొక్కిపెడుతూనే ఉన్నది. అప్పటినుంచి ఒక్కో అడుగు ముందుకేస్తూ పోతున్నది. అయినా, ఏదో ఒక రూపంలో అధికారుల నుంచి సమాచారం బయటకు పొక్కుతున్నది. వాస్తవాలు బయటకు వెల్లడించేందుకు సిద్ధంగా లేని రాష్ట్ర సర్కారు ఇప్పటి వరకు ఇస్తున్న అరకొర సమాచారం కూడా బయటకు రాకుండా కుయుక్తులకు పూనుకుంటున్నది. ఇప్పటివరకూ క్షేత్రస్థాయిలో ఆ శాఖల పీఐఓలు సమాచారం ఇచ్చేవారు.ప్రభుత్వ అనధికార ఆదేశాలతో కొంతకాలంగా ఎన్ని అర్జీలు పెట్టుకున్నా అధికారులు సమాచారాన్నే ఇవ్వట్లేదు. పైగా 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే సంబంధిత పీఐఓపై జరిమానా విధించి శాఖాపర చర్యలు తీసుకోవాలనే అంశాన్ని గాలికొదిలేసింది. దీంతో సమాచారం ఇవ్వకపోతే ఏం కాదులే అనే భావన అధికారుల్లో వచ్చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫెనాల్టీలు వేసిన సందర్భాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చునని ఆర్టీఐ ఉద్యమ కారులు బాహాటంగానే చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు సర్క్యూలర్ వల్ల పీఐఓలు తమ స్వతంత్రను కోల్పోనున్నారు.గతంలో ఆర్టీఐ కమిషన్ సభ్యుల పదవీకా లం ఐదేండ్లు ఉండగా దాన్ని మూడేండ్లకు కుదించారు. మెజిస్ట్రేట్ పవర్స్ వారికి ఉండేవి.ఐఏఎస్ అధికారులను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించే అధికారం ఉండేది.కానీ,రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శు లు,ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులు, హెచ్ఓడీ ల అనుమతి లేనిదే సమాచారం ఇవ్వొద్దని ప్రకటించడ మంటే..సభ్యుల స్వతంత్రను దెబ్బతీయడమే అవుతుంది అనే భావనను ఆర్టీఐ సామాజిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఏ శాఖ అయినా పనులకు సంబంధించిన వివరాలను, జీఓలను, బిల్లులను వెబ్సైట్లో కచ్చితంగా పొందుపర్చాలి. కొంతకాలంగా అదేమీ జరగడం లేదు. ప్రభుత్వం జారీ చేసే జీవోలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడం లేదు. ఈ విషయంలో కోర్టులు పలుమార్లు మెట్టికాయలు వేసినా రాష్ట్ర సర్కారు చెవికెక్కడం లేదు.
పారదర్శకత లేకనే సమాచారాన్ని దాచే యత్నం
ఎం.శ్రీనివాస్, ఆర్టీఐ ఉద్యమకారుడు
పైస్థాయి అధికారి అనుమతి తీసుకుని సమాచారం ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదు. సమాచారాన్ని ఆయా శాఖల వెబ్సైట్లో ఎందుకు పొందుపర్చడం లేదు? ప్రభుత్వ ఆర్డర్లను దాచిపెట్టాల్సిన భయం రాష్ట్ర సర్కారుకు ఎందుకు పట్టుకున్నది? మంచి పనులు చేస్తే బహిరంగంగా ఎందుకు ప్రకటించడం లేదు? సమాచారం చెప్పట్లేదంటేనే వెనుక నుంచి ఏదో జరుగుతున్నట్టే. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే ప్రభుత్వం తాను చేసే పనుల గురించి వారి ముందు ఉంచాలి కదా? ప్రభుత్వ జీవోలనే చెప్పకపోతే ఎలా అమలు చేస్తావు? స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు, రహస్య అజెండాను అమలు చేసేందుకే రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదనే అనుమానం వ్యక్తమవుతున్నది. జవాబుదారీ తనం పెరగాల్సిన తరుణంలో ఇలాంటి నిర్ణయాలేమిటి? వెంటనే సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలి.
పౌర వ్యతిరేక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి
కె. పార్థసారధి, ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని ఇప్పటికే సరిగా అమలు జరపకుండా సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారాన్ని నెలలు గడిచినా ఇవ్వడం లేదు. పై అధికారుల అనుమతిలేనిదే సమాచారం ఇవ్వొద్దంటూ సర్క్యూలర్ జారీ చేయడం చట్టం స్ఫూర్తికే విరుద్ధం. పౌరుల ప్రశ్నించే హక్కును కాల రావడమే. ప్రజలకు సమాచారం చేరకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ చర్య వల్ల స్వతంత్రంగా పని చేస్తున్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు తమ అధికారాలు కోల్పోతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలి.