Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డున పడ్డ రోగులు
- మందులు, పరీక్షలు, ఇతర ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు
- మానసికంగా కుంగిపోతున్న కుటుంబాలు
ఏ ప్రభుత్వానికైనా అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం మొదటి విధిగా ఉండాలి. చేయూతనిస్తూ పథకాలు, కార్యక్రమాలు కొనసాగించాలి. సంక్షేమ రాజ్యానికి అది మరీ ముఖ్యం. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి పని చేయగలిగిన వారికే ఉపాధి, ఉద్యోగం దొరకడం దుర్లభంగా మారిన పరిస్థితుల్లో మనం ఇప్పుడున్నాం. అలాంటిది వారానికి కేవలం మూడు రోజులు పని చేసి, మరో మూడు రోజులు ఆస్పత్రికి అంకితమయ్యే వారికి ఉద్యోగం ఎవరిస్తారు?. వారంతా మూత్రపిండాలు రెండు పాడైపోయిన స్థితిలో దీర్ఘకాలిక కిడ్నీ రోగులుగా వారానికి మూడు రోజులు డయలసిస్ (రక్తశుద్ధి) చేసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చిన రోగం, తప్పనిసరిగా చేసుకోవాల్సిన వైద్యం, వాడాల్సిన మందులు, క్రమం తప్పకుండా పరీక్షలు, వీటికి తోడు తమపై ఆధారపడ్డ కుటుంబాలను నెట్టుకురావటం వెరసి ఆర్థిక కష్టాలతో మానసికంగా కుంగిపోతూ ఆ రోగులే కాదు..... వారి కుటుంబసభ్యులు కూడా జీవచ్ఛవాలుగా మారుతున్నారు. పదే పదే సర్కారు సాయం చేయాలని కోరుతూ ఎదురు చూస్తూనే ఉన్నారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం... ప్రస్తుతం 23, 431 మంది డయాలసిస్ రోగులున్నారు. ఈ జబ్బుతో గత కొన్నేండ్లుగా ప్రతి ఏటా సరాసరిగా 1,500 మంది వరకు చనిపోతుండగా దీనికి మరో 500 మంది అదనంగా అంటే 2,000 మంది వరకు డయాలసిస్ రోగుల జాబితాలో చేరుతున్నారు. నియంత్రణ లేని మధుమేహ వ్యాధి, హైపర్ టెన్షన్, వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన కారణాలు, తెలియని ఇతర కారణాలతో డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు డయాలసిస్ చేసుకుంటున్న వారిలో ఇతర వ్యాధులున్న వారికి అదనపు సమస్యలు తోడవుతున్నాయి. ఆ జబ్బుకు శాశ్వత పరిష్కారంగా కిడ్నీ మార్పిడి చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నప్పటికీ కిడ్నీ దాతల కన్నా అవసరమైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో కొద్ది మందికి మాత్రమే అది సాధ్యమవుతున్నది. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జీవన్ దాన్ వద్ద 2013 నుంచి ఇప్పటి వరకు 3,415 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. తద్వారా 1,414 మందికి మార్పిడి చేశారు. డయాలసిస్ రోగుల్లో ఎక్కువ మందికి అవగాహన లేకపోవటం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స పట్ల ఉన్న భయంతో పాటు దానికయ్యే ఖర్చు లక్షల్లో ఉండటం కూడా జీవన్‌దాన్ వద్ద నమోదు చేసుకోకపోవటానికికారణంగా తెలుస్తున్నది. ప్రతి 10 డయాలసిస్‌ల తర్వాత రోగులు తప్పని సరిగా యూరియా క్రియాటిన్ తదితర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐరన్ వైరల్ టెస్ట్, హెచ్ఐవీ పరీక్షలూ తప్పవు. వీటికి తోడు రక్తం తగ్గుతుం దని భావించిన సమయంలో ప్రత్యేక ఇంజెక్షన్లు, అప్పుడప్పుడు అవసరమైన మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రెండు రోజులకొకసారి ఇంటి నుంచి ఆస్పత్రికి ప్రయాణం.దీంతో వైద్యానికి, ఇంటిని నెట్టుకొచ్చేందుకు ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.25 వేలు ఖర్చవుతున్నది. ఒకవైపు సంపాదన కోల్పోయి, మరోవైపు రోగాలతో ఇబ్బందులు పడుతూ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోలేక మానసిక వేదనకు గురవుతున్నారు.
ఆదుకున్న ఆంధ్రప్రదేశ్
ప్రతి నెలా తమకు కనీసం రూ.10 వేల వరకు పెన్షన్ ఇవ్వాలని డయాలసిస్ రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.3,500 పెన్షన్‌గా ఇచ్చారు. అనం తరం ఎన్నికల సమయంలో వైసీపీ అధ్యక్షులు .జగన్మోహన్ రెడ్డి పాదయా త్రలో వారి సమస్యలు విని అధికారంలోకి వస్తే రూ.10 వేలు పెన్షన్ ఇస్తానన్న హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీని అమలు చేశారు. ఇదే విధంగా తెలంగాణలో అనేక ఏండ్ల నుంచి డయాలసిస్ రోగులు తమను ఆదుకోవాలని కోరుతుండగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి సిహెచ్.లక్ష్మారెడ్డి హయాంలో రూట్ బస్ పాస్‌ను ఇప్పించారు. అయితే అది నామమాత్రంగానే ఉపయోగపడుతున్నా, డయాలసిస్ రోగులు ఎక్కువగా క్యాబ్‌లు, ఆటోల్లోనే ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తున్నదని తెలిసింది. దీంతో ప్రయాణ ఖర్చులు కూడా రోగులకు అదనపు భారంగా మారాయి.
రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలి
డయాలసిస్ రోగులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలి. ఈ అంశంపై పలుసార్లువైద్యారోగ్యశాఖ మంత్రులను కలిసి వినతి పత్రాలిచ్చా మనీ, పలువురు ప్రజా ప్రతినిధులకు తమ గోడు వెళ్లబోసుకున్నాం. కుటుంబాల పై పూర్తిగా ఆధారపడి బతికే తమకు ఆర్థిక సాయం చేయాలి.
- వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్.మోహన్
తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్