Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 29,30 తేదీల్లో మేడ్చల్‌లో వ్యకాస రాష్ట్ర మహాసభలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 29,30 తేదీల్లో మేడ్చల్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని రాజబహదూర్‌గౌర్ హాల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశం ఆ సంఘం అధ్యక్షులు కలకొండ కాంతయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతాంగం, వ్యవసాయ కూలీల ఉసురు తీస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు పాలకులు పూనుకున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను ప్రతిరోజు పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మోడీ సర్కారుపై సమరశంఖం పూరించాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, 57 ఏండ్లకు ఆసరా పింఛన్లు, పోడు పట్టాల పంపిణీ, దళిత బంధు అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు టి. వెంకట్రాములు మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ చట్టం కింద యేటా రెండు వంద రోజుల పనిదినాలుకల్పించి రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 22న కలెక్టరేట్ల ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి వ్యవసాయ కార్మిక ఉద్యమాలను బలోపేతం చేయాలనీ, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలన్నారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మోతే లింగారెడ్డి, సయ్యద్ అప్సర్, ఎ.బాబు, తాజుద్దీన్, దుబాస్ రాములు, చింతకుంట్ల వెంకన్న, సృజన్‌కుమార్, కర్రె లక్ష్మణ్, టిశంకర్, ధనుంజయ నాయుడు, వీరస్వామి, రామనాథం, మార్టిన్, భూమయ్య పాల్గొన్నారు.