Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కళాశాల మారిన అక్షితను నకిరేకల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయించేలా చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌కు గురువారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు ఈమెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన అక్షిత ఇంటర్ ప్రథమ సంవత్సరం హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేటలోని నారాయణ జూనియర్ కాలేజీలో చదివారని పేర్కొన్నారు. కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం నకిరేకల్ దగ్గర గౌతమి జూనియర్ కాలేజీలో చదువుతున్నారని వివరించారు. ఆ విద్యార్థికి ప్రస్తుతం పరీక్షలు రాయడానికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఇన్ఫెంట్ జీసస్ జూనియర్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాన్ని ఇంటర్ బోర్డు కేటాయించిందని తెలిపారు. నకిరేకల్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఆ పరీక్షా కేంద్రం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందుకే ఆమె నివాస స్థలం నకిరేకల్‌లో పరీక్షా కేంద్రం కేటాయించి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.