Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంచార్జీలు, సమన్వయకర్తలకు రేవంత్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్కు 'ఇంటికో ఓటు వేయండి' అనే నినాదంతో హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన ఎన్నికల ఇంచార్జిలు, సమన్వయకర్తలతో మాట్లాడారు. వారంరోజులపాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ ఇంటికో ఓటు నినాదాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలు, చేసిన నష్టాలను వివరించాలని తెలిపారు. ఈ ఉప ఎన్నికలకు కారణమేంటి? దళిత బంధును అడ్డుకున్నదెవరు? ఇచ్చిన మాటలు అమలు చేయకుండా ప్రజలను వంచించిదేవరో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలను, చీకటి రాజకీయాలను బయటపెట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.