Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
- పోరాట ఫలితమే : లక్ష్మణ్‌నాయక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 114 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ జీతాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్లలో పనిచేస్తున్న 142 మంది బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించాలని డీఈవోలను ఆదేశించారు. కొత్తగా నియామకం అయిన వారి వివరాలను జీతాల కోసం పేరోల్‌లో కలపాలని సూచించారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు 19 నెలల జీతం పెండింగ్‌లో ఉందన్నారు. ఈ పోరాట ఫలితంగానే జీతాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అంగీకరించిందని చెప్పారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ రాజీవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకావత్ శర్మన్, ఉద్యోగులు బిక్కులాల్, గన్నారవి, నీలావతి, పార్వతి, పద్మ, నిర్మల, ప్రేమలత, శోభ తదితరులు పాల్గొన్నారు.