Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల స్వీకరణపై మార్గదర్శకాలు విడుదల చేయాలి
- తెలంగాణ గిరిజన సంఘం సమావేశంలో జూలకంటి, శ్రీరాంనాయక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పోడు సమస్యను పరిష్కరించి హక్కుపత్రాలిచ్చేందుకు రోడ్ మ్యాప్‌ను వెంటనే ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్ డిమాండ్ చేశారు. పోడు సాగుదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆ సంఘం అధ్యక్షులు మూఢ్ ధర్మానాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్ల నుంచి మోసం చేస్తున్నదనీ, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక సభల్లో హక్కు పత్రాలిస్తామన్న హామీ ఏమైందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ నెల మూడో వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చిన ఆయన నేడు దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోడు సమస్య పరిష్కారంపై తక్షణమే గిరిజన సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామసభలు నిర్వహించాలనీ, అర్హులందరికీ హక్కుపత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు భూక్యా వీరభద్రం, దీరావత్ రవి నాయక్, ఉపాధ్యక్షులు కొర్ర శంకర్ నాయక్, బానోతు బాలాజీ, బానోతు చందు నాయక్, రమావత్ పాండు నాయక్ పాల్గొన్నారు.