Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాఖల ఉన్నతాధికారి అనుమతితోనే సమాచారమివ్వాలనటం సరిగాదు
- అవినీతి, పారదర్శకలేమి పెరిగేందుకు ఊతర
- ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
- గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆయా శాఖల ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే ఆర్టీఐ దరఖాస్తుదారులకు సమాచారమివ్వాలనే రాష్ట్ర సర్కారు నిర్ణయం సమాచార హక్కు చట్టం సెక్షన్ 7(1)కి విరుద్ధంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అవినీతి మరింత పెరిగేందుకు ఆస్కారముం దనీ, పాలనలో పారదర్శకత లోపిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. పార్ల మెంటు జారీ చేసిన చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎక్కడిదని ప్రశ్నించారు. దాన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ను కోరారు. గురువారం ఈ మేరకు ఆయన గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. ఉపాధి హామీ పనులపై పౌరుడు సమాచారం కోరితే..ఆ దరఖాస్తు పంచాయతీ కార్యదర్శి నుంచి సచివాలయంలోని ప్రధాన కార్యదర్శికి చేరడానికి మూడు, నాలుగు అంచెలు దాటుకుని వెళ్లాలనీ, తిరిగి సమాచారం రావడానికి కూడా అన్ని దశలు పడు తుందని వివరించారు. ఈ విధంగా సమాచారం పొందడానికి కొన్నేండ్లు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం సమాచార అధికారి దరఖాస్తు అందిన వెంటనే నెలలోపే సమాచారం ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది జరగాలంటూ చట్టంలో పేర్కొన్నారని వివరించారు.
సమాచారం ఇచ్చే నిర్ణయాధికారం పీఐఓలకు ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సమాచారం ఇవ్వడం ఇష్టం లేదన్నారు. గతంలో రాష్ట్ర సర్కారు సమాచార కమిషన్‌ను మూసివేసిందనీ, ఈ అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కమిషనర్ల నియామకాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లో ముఖ్యమైన జీవోలను రాష్ట్ర సర్కారు ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదనీ, పాలనంతా రహస్యంగా నడుస్తున్నదని విమర్శించారు. పీఐఓలు దరఖాస్తులను పరిశీలించకుండానే ఇష్టమున్నట్టు సమాచారం లీకు చేస్తున్నారనే కుంటిసాకుతో ముఖ్య కార్యదర్శుల అనుమతితోనే సమాచారం ఇవ్వాలని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర సర్కారు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు.