Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీం అమలును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలుపుదల చేయడాన్ని తప్పుపడుతూ సీనియర్ విలేకరి, సంఘ సేవకుడు మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో పిల్ వేశారు. ఎన్నికల తేదీలతో ఈసీ షెడ్యూల్ ప్రకటించేందుకు ముందే దళిత బంధు అమల్లో ఉన్నందున, స్కీంను నిలుపుదల చేసే అధికారం ఈసీకి లేదన్నారు. రైతు భరోసా, రైతు బీమా వంటి స్కీంలు అమల్లో ఉండగా, వాటికి లేని అభ్యంతరం దళిత బంధుకు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో 'పోషణ్' పథకం అమలు చేసినప్పుడు ఈసీ కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా దళిత బంధు విషయంలో చేసిందన్నారు. హుజూరాబాద్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ వెల్లడించేందుకు ముందు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించిన 'సుప్ర' పథకానికి ఈసీ అడు ్డచెప్పలేదన్నారు. ఈసీ దళితులకు అమలు చేసే స్కీం విషయంలో అభ్యంతరం చెప్పడం ద్వారా తప్పుడు సంకేతాలు జనానికి చేరేలా చేసిందన్నారు. ఈసీ నిర్ణయాన్ని రద్దు చేయాలనీ, దళితబంధు అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిల్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించనుంది. ఈ పిల్లోఈసీ ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, షెడ్యూల్ కులాల కోపరేటివ్ సంస్థ ఎండీలను ప్రతివాదులు చేశారు.
ఓయూ జాగా అక్రమణపై విచారణ వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూమి కబ్జాపై పోలీసు కేసు నమోదు అయ్యిందనీ, పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఏజీ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. తులసి కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, యూనివర్సిటీకి మధ్య ఎకరం భూమి విషయంలో వివాదం ఉండేదనీ, ఇందులో సొసైటీ గెలిచిందనీ, ఆ తర్వాత యూనివర్సిటీ భూమి 3,800 గజాలను సొసైటీ అమ్మేసిందని తెలిపారు. సొసైటీని జాగాలను కొన్న ప్రయివేటు పార్టీల తరఫు లాయర్ ఈ వాదనను వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో సొసైటీ గెలిచిందని, అయినా కేసులు నమోదు చేసి యూనివర్సిటీ ఇబ్బందుకు గురిచేస్తోందన్నారు. దీనిపై కౌంటర్ వేస్తామని ఏజీ చెప్పడంతో విచారణ డిసెంబర్ మూడో వారానికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్రశర్మ అధ్యక్షతన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ అమర్నాథ్కు వీడ్కోలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ త్రిపురకు బదిలీ అయిన సందర్భంగా గురువారం ఆయనకు హైకోర్టు వీడ్కోలు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ అధ్యక్షతన న్యాయమూర్తులు సమావేశం అయ్యారు. అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌ను ఘనంగా సన్మానించింది. జస్టిస్ అమర్నాథ్గౌడ్ దంపతులను సన్మానించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్రశర్మ వారికి జ్ఞాపికను అందజేశారు.
బక్క జడ్సన్ పిల్
అన్ని ప్రభుత్వ పథకాలు కొనసాగుతుండగా, కేవలం దళిత బంధునే ఎందుకు నిలిపేశారంటూ ఏఐసీసీ సభ్యులు బక్కజడ్సన్ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దళిత బంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కోర్టులో ఆయన సవాల్ చేశారు. ఈ మేరకు గురువారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎం కేసీఆర్ ప్రభావితం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అన్నీ అమలవుతున్నప్పుడు దళిత బంధును మాత్రమే ఆపాలంటూ ఆదేశాలివ్వడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. దళిత బంధు పథకం యధావిధిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలకు ముందే ఆ పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆయన కోరారు.