Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే ఈసీ అనుమతి
- ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే వర్తింపు
- ఓయూ వీసీ డి రవీందర్
- 24 నుంచి ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం
- సీపీజీఈటీలో అమ్మాయిల సత్తా
- ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 2021-22 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్టీయూ హైదరాబాద్‌లో 53 సబ్జెక్టులకు చెందిన 45 పీజీ కోర్సులకు రాతపరీక్షలు జరిగాయని చెప్పారు. 78,305 మంది దరఖాస్తు చేయగా, రాతపరీక్షలకు 68,836 మంది హాజరయ్యారని వివరించారు. వారిలో 63,748 (92.16 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారని అన్నారు. ఇందులో అబ్బాయిలు 27,641 మంది దరఖాస్తు చేస్తే, 24,229 మంది పరీక్షలు రాయగా, 22,614 (93.33 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
50,661 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 44,604 మంది పరీక్షలు రాస్తే, 41,131 (92.21 శాతం) మంది పాసయ్యారని చెప్పారు. దరఖాస్తు చేసిన ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఉత్తీర్ణత పొందారని అన్నారు. ఈనెల 24 నుంచి పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అదేనెల 27 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్లో జరుగుతుందని వివరించారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు మీసేవతో అనుసంధానం చేసినందున ఆన్లైన్లోనే పరిశీలిస్తామని అన్నారు. ఓయూ వీసీ డి రవీందర్ మాట్లాడుతూ ఓయూ పరిధిలో పీజీ కోర్సులకు సంబంధించిన ఫీజులను పెంచబోతున్నామని చెప్పారు. ఎంత ఫీజు పెంచాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) అనుమతి ఇచ్చిందన్నారు. ఈ పెంపు ఫీజురీయింబర్స్‌మెంట్ పరిధిలోనే ఉంటుందని వివరించారు. విద్యార్థులపై భారం పడబోదని చెప్పారు. కోర్సును బట్టి ఫీజును పెంచుతామని అన్నారు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుల ఫీజులనూ పెంచుతున్నట్టు వివరించారు. సీపీజీఈటీలో అమ్మాయిలు సత్తా చాటారని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమ్మాయిలు ఎక్కువగా వస్తున్నారని అన్నారు. సామాజిక, ప్రభుత్వ విధానాలు ఇందుకు కారణమని వివరించారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు దోహదపడుతున్నాయని చెప్పారు. మహిళా విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సీపీజీఈటీ కన్వీనర్, ప్రవేశాల డైరెక్టర్ ఎల్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ పీజీ కోర్సుల్లో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో 41,174 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 4 వేలు, కొన్ని కోర్సుల్లో 3 వేల నుంచి 4 వేల వరకు సీట్లు పెరిగే అవకాశముందన్నారు. నవంబర్ 15 నుంచి పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరలోనే పూర్తిస్తాయి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ, ప్రొఫెసర్లు గంగాధర్, ప్యాట్రిక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.