Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూస్వామ్య, పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని గద్దె దించాలి
- సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా 3వ మహాసభలో చెరుపల్లి
- నూతన కార్యదర్శిగా సోమయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
భూస్వామ్య, పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో ఉన్న ఈ ప్రభుత్వం పోవాలని, కష్టజీవుల రాజ్యాధికారం రావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. హైదరాబాద్ మలక్‌పేట్‌లోని సంహిత కాలేజ్ (అబ్దుల్ సత్తార్ ప్రాంగణం)లో గురువారం గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా 3వ మహాసభ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ ఈ సమాజం పట్ల చాలా అవగాహనతో ఉందన్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ జాతర పార్టీలని.. అధికారం కోసం ఎన్నో హామీలు ఇస్తాయని, ఆ తర్వాత విస్మరిస్తాయని చెప్పారు. సీపీఐ(ఎం) దేశంలో సమసమాజం కోసం పనిచేస్తోందన్నారు. లౌకిక విధానాలను అవగాహన చేసుకుని భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దుకున్నామని, ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. మతసామరస్యాన్ని కాపాడటం కోసం.. రానున్న రోజుల్లో మతతత్వ బీజేపీని గద్దె దించడం కోసం కలిసోచ్చే వామపక్ష శక్తులను కలుపుకుని పనిచేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలో సైతం బీజేపీ మతసామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందని, ఆ ప్రయత్నాలను అడ్డుకుని.. బీజేపీని నిలువరించాలని అన్నారు. ఆ బాధ్యత మనమే తీసుకుని ముందుకు పోవాలన్నారు. సౌత్ ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేయాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయాలని, అన్ని ప్రజాసమూహాల్లోకి ఎర్రజెండాను తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.
నూతన కార్యదర్శిగా ఎన్.సోమయ్య ఎన్నిక
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా నూతన కమిటీని 17 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి. నర్సింహారావు ప్రకటించారు. కార్యదర్శిగా ఎన్.సోమయ్య, కార్యదర్శివర్గ సభ్యులుగా జి.విఠల్, ఎల్.కోటయ్య, అబ్దుల్ సత్తార్, ఎం.మీనా, ఎం.లక్ష్మమ్మను ఎన్నుకున్నారు.