Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే కేంద్ర కుట్ర : ఎం.సాయిబాబు (సీఐటీయూ)
- గోదావరిఖని ప్రధాన చౌరాస్తాలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ - గోదావరిఖని
నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్(ఎన్ఎంపీ) పేరుతో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, బొగ్గు పరిశ్రమతో సహా అన్నింటినీ స్వదేశీ, విదేశీ, గుత్తా పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మాలని కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయించిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు అన్నారు. ఎన్ఎంపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనంచేశారు. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చి, కార్మికులను కట్టు బానిసలుగా మార్చేం దుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇప్పటికే రైతులు ఏడాదిగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయా లని పోరాటాలు చేస్తున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. దేశంలోని సహజ సంపద వనరులు అన్నిం టిని కూడా పెట్టుబడిదారులకు కేంద్రం దారాదత్తం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ వ్యతిరేక చర్యలను మానుకోవాలనీ, లేదంటే ఈరోజు దిష్టిబొమ్మల దహనం చేస్తున్నాం.. రానున్న కాలంలో ప్రజల ఐక్యతతో బీజేపీ ప్రభుత్వాన్ని దహనం చేయక తప్పదని హెచ్చ రించారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సీఐటీయూ సీనియర్ నాయకులు వై.యాకయ్య, పెద్దపెల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఎర్రబెల్లి ముత్యం రావు, ఐద్వా జిల్లా కార్యదర్శి మహేశ్వరి, సహాయ కార్యదర్శి జి.జ్యోతి, కోశాధికారి ఏం.రామాచారి, జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్, అన్నం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ వీధి దీపాల ప్రయివేటీకరణ, మిషన్ భగీరథ ప్రయివేటీకరణను నిరసిస్తూ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో పంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కరెంట్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిరసన తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై గోడౌన్, విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.