Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోండి
- కేంద్ర సమాచార కమిషనర్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైరదాబాద్
దరఖాస్తుదారుడికి ఆర్టీఐ కింద సమాచారమిచ్చే ముందు పై అధికారి అనుమతి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేయడాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ తప్పుపట్టారు. శుక్రవారం ఈమేరకు ఢిల్లీలో ఇదే అంశంపై కేంద్ర సమాచార కమిషనర్ వైకె సిన్హాకు ఆయన ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా సీఎస్ ఇచ్చి ఆదేశాలను వెనక్కి తీసుకునేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హక్కులను రక్షించడంలో అనేక కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జాతీయ సమాచార హక్కు చట్టం-2005 అమలు చేయడంలో కొనసాగుతున్న లొసుగులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రజలు కోరుతున్న సమాచారానికి ఒక రకమైన సమాచారం, సీఎంకు మరో సమాచారమిస్తూ ఆర్టీఐ చట్టానికి సీఎస్ తూట్లు పొడుస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయడంలో సర్కారు సుముఖంగా లేదని వివరించారు. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేర్కొన్నారు. వెబ్సైట్లో సాధారణ జీవోలు మాత్రమే కనిపిస్తున్నాయనీ, కీలకమైన జీవోలను సర్కారు దాచిపెడుతున్నదని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా, చట్టానికి విరుద్ధంగా పని చేస్తున్న సీఎస్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.