Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కొమురం భీమ్ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చెప్పారు. 'మా గూడెం, మా తండాలో మా రాజ్యం' అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని పేర్కొన్నారు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆదివాసీల అభివృద్ది, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కొమురం భీమ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. ఆయన జన్మించిన జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి పరిచామని వివరించారు. కొమురం భీమ్ స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియ పరిచేలా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా హైదరాబాద్‌లో ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టామనీ, అది ప్రారంభోత్సవానికి సిద్ధ్దమైందని తెలిపారు. 'జల్ జంగల్ జమీన్' అనే నినాదంలోని స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, స్వరాష్ట్ర అభివృద్ధి పథంలోనూ ఇమిడి వున్నదని పేర్కొన్నారు. అడవులు ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు వుండే ప్రేమ గొప్పదనీ, వారి స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ కలిగి వుండాలని సిఎం కెసిఆర్ తెలిపారు.