Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి నిరోధక శాఖలకు అధికారులు, సిబ్బందిని నియమించాలి
- గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అవినీతిని అరికట్టడంలో రాష్ట్ర సర్కారు విఫలమవుతున్నదనీ, అవినీతి నిరోధక శాఖలకు అధికారులను, సిబ్బందిని వెంటనే నియమించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి లేఖ శుక్రవారం రాశారు. చట్టబద్ధంగా పొందాల్సిన సేవలకు కూడా లంచం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న కేసులను కూడా సచివాలయంలో కొందరు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అవినీతి నిరోధక శాఖ, సీఐడీకి పై అధికారి లేక విజిలెన్స్ డీజీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీబీసీఐడీ, డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, ట్రిబ్యునల్, విజిలెన్స్ కమిషన్‌కు ఒకే అధికారి బాధ్యతలు చేపట్టడం వల్ల ఏ శాఖకూ న్యాయం చేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌కు జడ్జి లేక వందల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో మూలుగుతున్నాయని వివరించారు. విజిలెన్స్ కమిషన్ నివేదికలను అసెంబ్లీలో పెట్టి చర్చ జరిపించాలని నిబంధనలున్నా ఏడేండ్లుగా ఆ పని జరగట్లేదని తెలిపారు. అవినీతి నిరోధించే శాఖల పనితీరు కుంటుపడటం వల్ల ఏమి చేసినా చెల్లుతుందనే వాతావరణం ఉద్యోగుల్లో వచ్చిందని అభిప్రాయపడ్డారు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.