Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల
- తెలంగాణ అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం మారాలి
- శంషాబాద్ అభివృద్ధి చూస్తే పరిపాలన ఏవిధంగా ఉందో తెలుస్తుంది
- పాదయాత్రకు భారీ స్పందన
నవతెలంగాణ-శంషాబాద్
రాష్ట్రంలో మాయమాటలతో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ తెలంగాణ వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. శుక్రవారం మూడో రోజు పాదయాత్ర రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కాచారం నుంచి నర్కూడ మీదుగా శంషాబాద్ వరకు 10 కిలోమీటర్లు సాగింది. ఈ పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా వింటూ ముందుకు సాగారు. అనంతరం శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సాయంత్రం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఐదేండ్ల పాలనలో పేద బడుగు, బలహీనవర్గాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే, ఎయిర్‌పోర్ట్‌తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్స్, పేదల కోసం ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ , పావలా వడ్డీ రుణాలు, రైతు రుణమాఫీ, ఇండ్లు ఇళ్ల స్థలాలు, రాజీవ్ గృహకల్ప, వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోగా.. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ పథకాలు అమలు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. హుజురాబాద్‌లో దళిత బంధు పథకం అమలు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదనీ, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి రాష్ట్రంలో ధరణి ద్వారా భూములను గుంజుకొని మోసం చేస్తున్నారని విమర్శించారు. దళితులనే కాదు అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడని మహిళలు బయట తిరిగే పరిస్థితులు లేవని లైంగికదాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌లో నాలుగేండ్ల పాపపై లైంగికదాడి జరిగితే, తిరిగి బాధిత కుటుంబాలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అద్భుత ప్రగతి ఉందని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ దమ్ముంటే తనతో పాటు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన తీసుకురావడం తన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారనీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్లని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని అన్నారు.
శంషాబాద్‌లో అభివృద్ధి ఎక్కడ..
శంషాబాద్‌లో అబివృద్ధి ఎక్కడ అని షర్మిల ప్రశ్నించారు. త్రిబుల్ వన్ జీవో చేస్తామని సీఎం మాట ఇచ్చి ఎందుకు ఎత్తేయలేదని ప్రశ్నించారు. శంషాబాద్ ప్రాంతంలో ఖరీదైన భూములను కొల్లగొట్టే ఉద్దేశంతోనే జీవో పై నిర్ణయం తీసుకోవడానికి కేసీఆర్ వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్న శంషాబాద్‌ను మెట్రో సిటీ అభివృద్ధి చేస్తామని చెప్పిన నేతలు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. తాను సభ పెట్టిన చోటనే వీధి లైట్లు లేని దుర్భర స్థితి కనిపిస్తుందని అన్నారు. శంషాబాద్‌లో అంతర్గత డ్రయినేజీ వ్యవస్థ వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని అన్నారు. శంషాబాద్‌లో చేపట్టిన అభివృద్ధిని చూస్తే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుందని అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని ఆశీర్వదిస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన మళ్లీ తీసుకువస్తామని రాజన్న బిడ్డగా మీకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, మహిళలకు ఆత్మగౌరవం, మంచి భవిష్యత్తును అందించడం, భద్రత కల్పించడం జరుగుతుందన్నారు. అందుకే టీఆర్ఎస్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, అక్రం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.