Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు డోసులు తీసుకుంటేనే మంచిది
- టీకాలు వేయడంలో దేశానికే తెలంగాణ ఆదర్శం : సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా ఇక పోయిందనే అలసత్వం తగదనీ, ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. కరోనా టీకాలను విజయవంతంగా వేయడంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశంలో వంద కోట్లు, రాష్ట్రంలో మూడు కోట్ల డోసులు వేయటం పూర్తయిన సందర్భంగా కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయంలో ఆకాశంలోకి బెలూన్లను వదిలారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎమ్ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఎమ్డీ చంద్రశేఖర్, డీఎమ్ఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, కెఎన్ఆర్యూహెచ్ఎస్ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఎస్ఐఓ డాక్టర్ జి.సుధీర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. టీకాలను వేయడంలో నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ చాలా ముందంజలో ఉందని తెలిపారు. థర్డ్‌వేవ్ వస్తుందో..రాదో తెలియదుగానీ, కరోనా ముప్పు ఇంకా పొంచే ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్ వస్తే మాత్రం ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదనీ, 200 నుంచి 300 మెగావాట్ల ఆక్సిజన్ తయారీకి అవకాశం ఉందని వివరించారు. విపత్తు సమయంలో అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయడం వల్లనే కరోనా ఉధృతిని రాష్ట్రంలో నిలువరించగలిగామన్నారు. రాష్ట్రంలో మొదటి కోటి డోసులు వేయడానికి 165 రోజులు, తర్వాతి కోటి డోసులు వేయడానికి 78 రోజులు, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఆ తర్వాతి కోటి డోసులను కేవలం 37 రోజుల్లో వేయడం జరిగిందని వివరించారు. రిజ్వి మాట్లాడుతూ...వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా చేపడుతున్న వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్లు, తదితర సిబ్బందికి అభినందనలు తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ..కరోనా నుంచి రక్షించుకోవడానికి వాక్సిన్ ఒకటే ఆయుధమన్నారు. కోవిడ్-19 కట్టడిలో తెలంగాణ మోడల్ స్టేట్‌గా నిలిచిందని కొనియాడారు. ఎప్పటికప్పుడు లక్ష్యాలు పెట్టుకుంటూ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడంలోనూ, సూపర్ స్పైడర్లను గుర్తించి వారి టీకాలు వేయడంలోనూ, ఫీవర్ సర్వే చేయించడంలోనూ సీఎస్ కీలక భూమిక పోషించారని తెలిపారు. వ్యాక్సినేషన్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆశాలు, ఏఎన్ఎమ్లు, వైద్య సిబ్బందికి ఏమిచ్చినా వారి రుణాన్ని తీర్చలేమన్నారు.