Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి దశలో వాయిదా వేయాలంటే : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేయబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయనీ, చివరి దశలో పరీక్షలను వాయిదా వేయాలంటే ఎలాగని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయడం సమంజసం కాదని అభిప్రాయం పడింది. ఇంటర్ బోర్డు పరీక్షలకు నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 వేల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైంది. రిట్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకునేందుకు అనుమతినిస్తున్నాం.. అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలన్న అత్యవసర లంచ్ పిటిషన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి శుక్రవారం విచారణ చేపట్టారు. ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న సుమారు 4 లక్షల 58 వేల మంది విద్యార్థులకు ఇప్పుడు తొలి ఏడాది పరీక్షలు నిర్వహించడం సరికాదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) అధ్యక్షులు నాగటి నారాయణ వేసిన రిట్ తరఫు లాయర్ వాదిస్తూ, విద్యార్థుల మానసిక పరిస్థితులను కూడా బేరీజు వేయాలన్నారు. రెండో ఏడాది ఇంటర్మీడియట్ సబ్జెక్టులు చవువుతున్న వాళ్లకు తొలి ఏడాది పరీక్షలు పెట్టడం వల్ల తీవ్ర గందరగోళానికి గురౌతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఐదు నెలల క్రితం ప్రమోటైన ఫస్టియర్ పరీక్షలను ఈ నెల 25 నుంచి రాయాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. 4.58 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆందోళనలో ఉన్నారని, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు వాళ్ల ఆవేదనను పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏడాదిన్నర కాలంగా చదువుకు దూరమైన గురుకులాలు, వసతి గహాల విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలను నిర్వహిస్తే ఎలా రాయగలరని ప్రశ్నించారు. దీనిపై ఇంటర్ బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక జీపీ సంజీవ్‌కుమార్ వాదిస్తూ, కోవిడ్ వల్ల 4.58 లక్షల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయకుండానే ఇంటర్ తొలి ఏడాదికి ప్రమోట్ అయ్యారనీ, వారంతా ఇప్పుడు రెండో ఏడాది ఇంటర్ చదువుతున్నారనీ, కరోనా పరిస్థితులు సానుకూలంగా ఉంటే ఇంటర్ తొలి సంవత్సరం పరీక్షలు పెడతామని ముందుగానే విద్యార్థులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. కరోనా మూడో దశ వచ్చే ఏడాది మార్చిలో వస్తే అప్పుడు ఇంటర్ రెండో ఏడాది పరీక్షల నిర్వహణ కష్టం అవుతుందని, ఇదే జరిగితే 4.58 లక్షల మంది విద్యార్థులను ఏ ప్రాతిపదికపై రెండో ఏడాది ఉత్తీర్ణులైనట్లు ప్రకటించాలో అర్ధం కాని పరిస్థితులు ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. రిట్‌ను వెనక్కి తీసుకునేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి.
దళిత బంధుపై 25న విచారణ
దళితబంధు పథకం అమలును నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన పిల్‌తోపాటు, దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికలు అయ్యే వరకూ నిలిపివేయాలనే పిల్‌ను కలిపి ఈ నెల 25న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలతో సంబంధం లేకుండా రైతుభరోసా, రైతు బీమా తరహాలో దళితబంధు పథకాన్ని కూడా అమలు చేయాలని కోరుతూ సీనియర్ విలేకరి, సోషల్ వర్కర్ మల్లేపల్లి లక్ష్మయ్య వేసిన పిల్ మాత్రమే శుక్రవారం విచారణకు వచ్చింది. దీంతో అందుకు విరుద్ధ అభ్యర్థనతో దాఖలు చేసిన పిల్స్ కూడా గతంలోనే దాఖలు చేశామనీ, వాటిని కూడా విచారణ చేయాలని ఇద్దరు లాయర్లు కోరారు. అయితే మూడు పిల్స్‌ను వచ్చే సోమవారం విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ త్రిసభ్య కమిషన్‌పై హైకోర్టులో రిట్లు
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్ విచారణ చట్ట వ్యతిరేకంగా ఉందంటూ సీఐడీ డీఎస్పి వి.సురేందర్, బాచుపల్లి ఇన్స్పెక్టర్ కె.నర్సింహారెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా రిట్లు దాఖలు చేశారు. తమ కేసుల్ని అత్యవసరంగా విచారణ చేయాలని పిటిషనర్ల న్యాయవాదులు సింగిల్ జడ్జి వద్ద ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏర్పడిన త్రిసభ్య కమిషన్ విషయంలో జోక్యానికి సింగిల్ జడ్జి నిరాకరించారు. దీంతో చీఫ్ జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట శుక్రవారం ప్రస్తావించారు. సోమవారం విచారణ చేస్తామని డివిజన్ బెంచ్ అంగీకరించింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
ముంబై హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం తెలంగాణ హైకోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో చీఫ్ జస్టిస్ ఎస్సీ శర్మ ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్ ఉజ్జల్ ట్రాన్సఫర్ ఆర్డర్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నాగార్జున చదివారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ ఉజ్జల్ బంధువులు, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, సహాయ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ప్రమాణం చేశాక చీఫ్ జస్టిస్‌తో కలిసి కేసుల విచారణ చేపట్టారు. మధ్యాహ్నం హైకోర్టు బార్ అసోసియేషన్ జస్టిస్ ఉజ్జల్ భయాన్ సన్మానించింది. అసోసియేషన్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్, సెక్రటరీలు సీహెచ్ కల్యాణ్‌రావు, సృజన్‌కుమార్‌రెడ్డి, వైస్ చైర్మన్ పాషా ఇతరులు పాల్గొన్నారు.