Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాలకు రూ.1300 కోట్ల నష్టం
- నిర్వహణా అస్తవ్యస్తం
- కొత్త ప్రతిపాదనల తయారీలో పీఆర్ ఇంజినీరింగ్ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీరాజ్ రోడ్లను నిధుల సమస్య వెంటాడుతున్నది. దీర్ఘకాలికంగా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రోడ్లు అస్థవ్యస్థంగా తయారయ్యాయి. ప్రభుత్వ ప్రాధాన్యాత క్రమాల్లో ప్రస్తుతం రోడ్లు లేకపోవడంతో ప్రయాణీకులు, సరుకుల రవాణాకు ఇబ్బందులు తప్పడం లేదు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత రోడ్లకు అత్యంత ప్రాధా న్యత ఇచ్చారు. రెండు సంవత్సరాల్లో దాదాపు రూ. 4500 కోట్ల నుంచి రూ. 6000 కోట్లు మంజూరు చేశారు. సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, పీఎంజీఎస్‌వై తదితర పథకాల కింద భారీగానే నిధులను ఖర్చు చేశారు. తొలుత రోడ్లను బాగానే వేశారు. రెండో టర్మ్‌లో మాత్రం సర్కారు ప్రాథమ్యాల్లో రోడ్లులేకుండా పోయాయి. దీంతో సమస్య ప్రారంభమైంది. గుంతలమయంగా మారిపోయాయి. అంతేగాక ఇటీవల రెండు, మూడు నెలలుగా కురిసిన వర్షాలకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎజెన్సీ, అటవీ ప్రాంతాలతోపాటు మారుమూల జిల్లాల్లోని గ్రామీణ రోడ్లేగాక ఇతర ప్రధాన రోడ్లు సైతం అస్తవ్యస్తమయ్యాయి.
వర్షాలకు భారీ నష్టం..
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో పంచాయతీరాజ్ రోడ్లు అంత్యదశకు చేరుకున్నాయి వానలకు కంకర తేలడం, గుంతలు పడటం, తారు లేచిపోవడం, నీరు నిలవడం తదితర సమస్యలతో ప్రయాణీకులకు కష్టాలు తప్పడం లేదు.రవాణా ఇబ్బందికరంగా మారింది. అధికారిక సమాచారం ప్రకారం వర్షాల కు సుమారు 5078 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశముంది. ఈ విషయమై ఇప్పటికే సర్కారుకు రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ తాత్కాళిక నివేదిక పంపింది. ఈ సందర్భంగా పలు అంశాలను అందులో పొందుపరిచినట్టు సమా చారం. రూ.936 కోట్లు పునరుద్ధరణ కోసం, మరో రూ.278 కోట్లు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయడానికి నిధులు అవసరమవుతాయని అంచనా వేసినట్టు తెలిసింది. కాగా తొలుత రోడ్ల మరమ్మత్తులకు రూ. 300 కోట్లు ఇస్తా మన్న ప్రభుత్వం, గత మంత్రివర్గ సమావేశంలో మరో రూ. 100 కోట్లు అదనం గా ఇచ్చేందుకు అంగీకరించింది.
మొత్తం రూ. 400 కోట్లు రోడ్ల కోసం ఖర్చు పెట్టనుంది. అయితే భౌతిక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొత్త, పాత రోడ్ల నిర్మాణం, నిర్వహణ, మరమ్మత్తుల కోసం దాదాపు రూ.1300 కోట్ల మేర అవసర మవుతాయని పీఆర్ ఇంజినీరింగ్ శాఖ భావిస్తున్నది. ఈ మేరకు మరోసారి పూర్తిస్థాయి నివేదికను సర్కారుకు పంపనుంది. కనీసం రూ.800కోట్ల వరకు నిధులు సర్కారునుంచి రాబట్టేందుకు ఇంజినీరింగ్అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ నియోజకర్గాల్లో..
భారీ వానలకు దెబ్బతిన్న రోడ్లు రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నాయి. ఆదిలాబాద్, బోథ్, ధర్మపురి, హుస్నాబాద్, జనగామ, వరంగల్, నాగార్జునసాగర్, ములుగు, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈమేరకు ఆయా జిల్లాల నుంచి ఉన్నతాధికారులకు నివేదికలు అందాయి. అలాగే అశ్వరావుపేట, ఖమ్మం, పెద్దపల్లి, కుత్భుల్లాపూర్, రామగుండం, సిర్పూర్, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో స్వల్పంగా రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారిక సమాచారం. వీటన్నింటికీ సంబంధించి పీఆర్ ఇంజినీరింగ్ శాఖ రెండో దఫా పూర్తిస్థాయి నివేదికను సర్కారుకు పంపేందుకు సన్నద్ధమవుతున్నది.
ఉన్నతాధికారులతో ..
గ్రామీణ జిల్లాల్లోని రోడ్ల మరమ్మత్తుల కోసం పీఆర్ ఇంజినీరింగ్ శాఖ పలు ప్రయత్నాలు చేస్తున్నది. ముందుగా సీఎంవో కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న స్మీతా సభర్వాల్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామ కృష్ణారావుతో చర్చించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈమేరకు ఆ ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలిసింది.
అసెంబ్లీలోనూ చర్చ
వానలకు దెబ్బతిన్న రోడ్లపై గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించారు. తమ తమ నియోజకవర్గాల్లో రోడ్ల పరస్థితులు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. రోడ్లు గుంతలు పడి ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా రోడ్ల నిర్వహణ కోసం ఈ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, అమల్లో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది. తొలి ఏడాది మాత్రమే అమలుచేసిన సర్కారు, ఆతర్వాత గాలికొదిలేసింది. వర్కింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వహణ కాస్త అటకెక్కింది. 2014-2016 సంవత్సరాల మధ్య భారీగా కొత్త రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం, రెండో టర్మ్‌లో మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.