Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి
- లేదంటే నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులకు దేవుని గుళ్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఈనెల 18 నుంచి ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి.. ఇప్పటివరకు కొనుగోలు చేయడం లేదన్నారు. బావులు, బోర్ల వద్ద పండించిన వరి ధాన్యం చేతికి వచ్చిందన్నారు. రైతులు దాదాపు 25 రోజుల నుంచి లక్షల బస్తాల ధాన్యాన్ని రాసులుగా పోసుకొని కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు ఎకరానికి రోజుకు కూలీల కోసం రూ.800 ఖర్చవుతోందన్నారు. ధాన్యం రాశులు ఎండకు ఎండి.. వానకు తడిసి మొలకెత్తే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం నుంచి కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 180 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశార న్నారు. ఈసారి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే అధికారు లకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అర్జాల బావి సమీపంలో రైతుల ధాన్యం రాశులను పరిశీలించారు. ఈ సమావేశం లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హషం, కల్లు గీత కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.