Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబినార్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దీపావళికి కాల్చే పటాకులతో వాయుకాలుష్యం ఏర్పడుతుందనీ, తద్వారా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా పరిణమిస్తుందని వాతావరణ నిపుణులు, డాక్టర్లు, మేథావులు అభిప్రాయపడ్డారు. బాణాసంచా మూలంగా మానవుడి నరాల వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమై ఆరోగ్యం చెడిపోతుందని తెలియజేశారు. శనివారం ''వాయుకాలుష్యం..దాని నివారణలో ఎకో ఫ్రెండ్లీ బాణాసంచాపాత్ర'' అంశంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ తెలంగాణ చాఫ్టర్ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. ఇందులో తెలంగాణ కాలుష్య నియంత్రణా సంస్థ(టీఎస్పీసీబీ) మాజీ సంయుక్త పర్యావరణ అధికారి డాక్టర్ పీ.వీరన్న, ఎధిక్స్ క్లినికల్ ట్రయల్స్ కమిటీ చైర్మెన్ డాక్టర్ ఎంఎస్ విజయభాస్కర్, లీగల్ కన్సల్టెంట్ డాక్టర్ బాల, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్ తెలంగాణ ఛాప్టర్ డాక్టర్ బి. రమణా నాయక్, కార్యదర్శి డాక్టర్ పి. నారాయణరావు, గౌరవ కార్యదర్శి ఇంజినీర్ టి. అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాకుల తయారీలో రసాయన పదార్థాలను వాడతారని చెప్పారు. వాయు కాలుష్యం మూలంగా సహజ వాతావరణం దెబ్బతింటుందని తెలిపారు. ఓజోన్ పొరను సైతం ప్రభావితం చేస్తుందని వివరించారు. పటాకులు కాల్చడం మూలంగా వాయు కాలుష్యం, గ్లోబర్ వార్మింగ్, శబ్ధ కాలుష్యం, అదనంగా చెత్త తయారు కావడం, అగ్ని ప్రమాదాలు జరగడం, గర్భిణులతోపాటు పుట్టే శిశువులకూ ప్రమాదకరమనీ, అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. గ్రీన్ పటాకులతో ఈ సమస్యలు రావని తెలిపారు. ఉపాధి అవకాశాలు సైతం మెరుగ్గానే ఉంటాయని చెప్పారు. వాతావరణ కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందని తెలియజేశారు. బాణాసంచాను నిషేధించాలనే డిమాండ్ ఉత్పన్నం కాదన్నారు. న్యాయపరమైన సమస్యలూ రావని చెప్పారు. చెడు వాసనకు కూడా చెక్ పెట్టవచ్చని సూచించారు. పటాకులతో మనిషి నరాల వ్యవస్థ బలహీనమవుతున్నదన్నారు. శ్వాసనాళాలు తెబ్బతింటాయని వివరించారు. దీపావళి సమయంలో ఈ సమస్యలూ ఎక్కువగా వస్తాయని గుర్తు చేశారు.