Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే బీజేపీ ముందు టీఆర్ఎస్ మోకరిల్లుతున్నది
- కేటీఆర్ కుసంస్కారవాది: భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'గాంధీభవన్‌లో గాడ్సే దూరిండు' అంటూ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది.ఆయన అవగాహనలేని కుసంస్కారవాదిలా మాట్లాడుతున్నారని విమర్శించింది. కేసీఆర్ ప్రగతిభవన్‌లో గాడ్సేగా కొత్త అవతారమెత్తారనీ, అందుకే గాడ్సే వారసత్వమున్న బీజేపీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించింది. బీజేపీ మతతత్వ పార్టీ అనీ, కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అనీ, రెండింటిని ఒకే గాటున కడుతున్న కేటీఆర్‌కు అసలు రాజకీయ అవగాహనే లేదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎల్పీలో మల్లు భట్టి విక్రమార్క, గాంధీభవన్‌లో ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, మల్లు రవి, షబ్బీర్ అలీ, బెల్లయ్యనాయక్, అద్దంకి దయాకర్, సునీతారావు, అయోధ్యరెడ్డి, కాల్వ సుజాత, బండి సుధాకర్ తదితరులు వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ భిన్న ధృవాలుగా ఉన్నాయనీ, ఆ రెండు పార్టీలు కలిసిపోయాంటూ మంత్రి కేటీఆర్ బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎన్నో లోపాయకారి ఒప్పందాలు జరిగాయని విమర్శించారు. అందుకే బీజేపీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలకు కేసీఆర్ జై కొడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో దొంగల దోపిడీని ఆపాలంటే, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ చౌకబారు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండబోరనీ, కాంగ్రెస్ భావజాలమున్న నేతలే ఇక్కడ ఉంటారని స్పష్టం చేశారు. అక్రమ సంపాదనలో దేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్ నాయకుడిగా మిగిలిపోయారని విమర్శించారు. హుజురాబాద్‌లో ఓటమి భయంతోనే కేటీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు వరకు అనేక అంశాల్లో బీజేపీకి ఆ పార్టీ మద్దతునిచ్చిందని గుర్తు చేశారు. రైతులకు ఉరి తాళ్లుగా మారిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయకుండా టీఆర్ఎస్ పారిపోయి బీజేపీకి మద్దతునిచ్చిందని గుర్తు చేశారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వారు కేసీఆర్‌ను హెచ్చరించారు.