Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం ఆదేశాలు
- ఉపసంహరించుకోవాలి: ఎస్‌డబ్ల్యూఎఫ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులంతా యూనియన్ బ్యాంక్‌లో ఖాతాలను తెరుచుకోవాలని పేర్కొంటూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారనే వివరణను మాత్రం చెప్పలేదు. యూనియన్ బ్యాంక్ ఆర్టీసీకి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించింది. దానిలో ఆర్టీసీ కార్మికుల ఖాతాలన్నింటినీ ఆ బ్యాంకులోకే మార్చాల నే షరతు ఏమైనా విధించారా అనే సందేహాలను కార్మిక సంఘాలు లేవనెత్తుతున్నాయి. ఈనెల 11వ తేదీ బ్యాంకు ఖాతాలను యూనియన్ బ్యాంక్‌లో ఓపెన్ చేసుకోవాలని కోరుతూ ఐఆర్ 3/701(1)/2021 లేఖను అన్ని డిపోల మేనేజర్లకూ పంపారు. దీనిపై కార్మికులు గందరగోళ పడుతున్నారు. వారందరికీ ఇప్పటికే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్బీఐ)లో ఖాతాలు ఉన్నాయి. వేతనాలు ఆ ఖాతా ల్లోనే పడుతున్నాయి. ఆధార్, పాన్ నెంబర్లను ఆ ఖాతాకే లింక్ చేసుకున్నారు. జీతం ఖాతా కావడంతో అదే బ్యాంకు నుంచి గృహ, పిల్లల విద్య, వ్యక్తిగత రుణాలు కూడా తీసుకు న్నారు. ప్రతినెలా ఈఎమ్ఐలు చెల్లిస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కేవైసీ సందర్భంగా కార్మికులు అదే ఖాతాను అనుసంధానం చేసుకున్నారు. సీసీఎస్, ఎస్ఆర్బీసీ వంటి సామాజిక పథకాలకూ ఎస్బీఐ బ్యాంకు ఖాతానే అనుసంధానం చేసుకున్నారు. కరోనా కాలంలో జీతాలు సక్రమంగా రాకపోవడంతో మెజారిటీ కార్మికులు అదే బ్యాంకు ఖాతా నుంచి రూ.2 లక్షల వరకు పర్సనల్ లోన్లు తీసుకున్నారు. ఎస్బీఐ ఖాతాను కార్పొరేట్ అక్కౌంట్గా మార్చుకుంటే కార్మికులు, ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కూడా ఉంది. బ్యాంక్ మారితే ఈ సౌకర్యాన్ని వారు కోల్పోవల్సి వస్తుంది. వీటన్నింటికీ మించి ఒకరు ఒక బ్యాంక్ ఖాతాను మాత్రమే కలిగిఉండాలనే నిబంధనను ఇప్పటికే కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. అది అమల్లోకి వస్తే, కార్మికులు యూనియన్ బ్యాంక్‌కు మారితే ఎస్బీఐ ఖాతాను కోల్పోవల్సి వస్తుంది. యూనియన్ బ్యాంకుకు మారిన వారికే ప్రతినెలా 1వ తేదీ జీతాలు పడతాయనే ప్రచారం కార్మికుల్లో జరుగుతున్నది. దీనితో ఏం చేయాలో అర్థంకాక గందరగోళ పడుతున్నారు.
ఎందుకు మారాలి?
వీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఇప్పుడున్న ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి యూనియన్ బ్యాంకుకు ఎందుకు మారాలి? దీనిపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలి. ఎస్బీఐ కంటే మెరుగైన ప్రయోజనాలు యూనియన్ బ్యాంక్ ఏమైనా కల్పిస్తుందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో కార్మి కులకు చెప్పాలి. అలాంటిదేం లేకుండా ఖాతాలు మార్చు కోండి అని లెటర్లు పంపితే, సంస్థ లోని 50వేల మంది కార్మి కులు, ఉద్యోగులు గందరగోళ పడటం సహజం. ఇప్పుడున్న ఖాతాతో ఆర్టీసీ కార్మికులు అనేక ప్రయోజనాలు పొందుతు న్నారు. డిజిటల్ పేమెంట్స్ కోసం బ్యాంకు ఖాతాను ఎంచు కొనే సౌకర్యాన్ని కార్మికులకే వదిలేయాలి. దాన్ని షరతుగా మార్చడం సరికాదు. దీనిపై కనీసం డిపో మేనేజర్లకు కూడా స్పష్టత లేదు. వారిని అడిగితే పై నుంచి ఆర్డర్లు వచ్చాయని లేఖలు చూపుతున్నారు. దీనిపై యాజమాన్యమే వివరణ ఇవ్వాలి. ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇప్పటికే మేం టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు మా సంఘం తరఫున వినతిపత్రం ఇచ్చాం. ఇంకా సమాధానం ఏమీ ఇవ్వలేదు.