Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములు తీసుకుంటున్నారు
- హైకోర్టు దృష్టికి తెచ్చిన మల్లన్నసాగర్ నిర్వాసితులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భూసేకరణ చేసిన తమ భూములకు పరిహారం ఇవ్వకుండా మల్లన్నసాగర్ బండ్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని మల్లన్నసాగర్ ముంపు బాధితులు హైకోర్టుకు వెల్లడించారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తున్నారని సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, రాజిరెడ్డిలు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ధిక్కరణ కేసులో దోషులుగా తేలడంతో గజ్వేల్ ఆర్డీవో డీ విజయేందర్‌రెడ్డి, కొండపాక మండల తహసీల్దార్ బీ ప్రభులకు హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం జైలుశిక్ష, జరిమానా విధించింది. దీనిపై సదరు రెవెన్యూ అధికారులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఆర్అండ్ఆర్ మొత్తాన్ని ల్యాండ్ అథారిటీ (ఎల్ఏ) వద్ద డిపాజిట్ చేసినట్లు రెవెన్యూ అధికారులు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. దీంతో సింగిల్ జడ్జి విధించిన జరిమానాను రెవెన్యూ అధికారులు చెల్లించాలని ఆదేశించిన డివిజన్ బెంచ్.. జైలుశిక్షపై మాత్రం స్టే విధించింది. ఈ కోర్టు ధిక్కరణ అప్పీల్ కేసులపై తాజాగా చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ముంపు బాధితుల తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఒక్కరూపాయి కూడా తమకు అందలేదని, ధిక్కరణ కేసులో రెవెన్యూ అధికారులకు విధించిన జైలుశిక్ష పై స్టే తొలగించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.