Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ - వీణవంక/ జమ్మికుంట
బీజేపీ, టీఆర్ఎస్లది ఢిల్లీలో దోస్తాన్.. గల్లీలో గలాటా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండల కేంద్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉప ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు ప్రజలు కోరుకుంటే వచ్చినవి కాదని, రెండు ఆంబోతులు బలప్రదర్శన చేసుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. రైతు కల్లాల ఏర్పాటులో, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో, ఇండ్ల స్థలాల పంపిణీ, పోడు భూములకు పట్టాలివ్వడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. ఇంటికో ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయని టీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు..? విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదనా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వలేదనా..? నిరుద్యోగ భృతి గురించా..? ఇవేం కాదు.. పంపకాల్లో తేడా రావడంతో రాజీనామా చేశారని విమర్శించారు. పెట్రోలుపై పన్నుల రూపంలో మోడీ, కేసీఆర్ దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు, ఉద్యోగాల నోటిఫికేషన్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సాధన కోసం బల్మూర్ వెంకట్‌కు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు మేడిపల్లి సత్యం, పత్తిపాక కృష్ణారావు, ఠాగుర్ మక్కాన్ సింగ్, దేపా భాస్కర్, కైలాష్ నేత పాల్గొన్నారు.