Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన దుబారు లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించారు. శనివారం సాయంత్రం 9.40 గంటలకు, 10.40 గంటలకు నిర్వహించిన ప్రదర్శనను ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది వీక్షించారు. ముఖ్యమంత్రి చిత్రపటాన్ని సైతం స్క్రీన్ పై ప్రదర్శించారు. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటింది. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.
దేశానికే గర్వకారణం
విశ్వవేదికపై బతుకమ్మ ప్రదర్శన రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రదర్శన నిర్వాహకులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్ బాజీరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్ రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజరు, బిగాల గణేష్ గుప్తా , తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం వినరు భాస్కర్, ప్రవాస తెలంగాణవాసులు పాల్గొన్నారు.