Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నాగార్జున సాగర్, పోచంపాడు, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టులు తమ హయాంలోనే వచ్చాయని కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ చెప్పుకుంటున్నాయని, కానీ ఆ నిర్మాణాలు కమ్యూనిస్టు పార్టీల పోరాట ఫలితమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వామపక్షాల పోరాటాలు, ఉద్యమాల కారణంగానే పలు ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ రాసిన ''చరిత్రాత్మక రైతు రక్షణ యాత్ర (జులై 1937-మార్చి 1938)'' తెలుగు అనువాద పుస్తకాన్ని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మగ్దూం భవన్లో శనివారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నేత, మాజీ ఎంఎల్ఎ ఉజ్జిని యాదగిరిరావు సభాధ్యక్షత వహించగా చాడ వెంకట్‌రెడ్డి ప్రసంగించారు. కమ్యూనిస్టు నేతలు చేసిన త్యాగాలు నేటి తరానికి తెలియడం లేదన్నారు. ఇప్పటికైనా మన త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాలు వాటి ఫలితంగా జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధిని యువతరానికి తెలియజేయాలని సూచించారు. స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తే, రైతులకు గిట్టుబాటు ధర అందుతుందని, రైతుబంధు అవసరమే ఉండదని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయం ప్రయివేటీకరణ జరిగి, రైతు, వ్యవసాయం అనే పదాలు పోతాయని, చివరకు రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చట్టంలో కనీస మద్దతు ధర అంశమే లేదన్నారు.మహిళా కమిషన్ మాజీ సభ్యులు పరుచూరి జమున మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులన్నీ ప్రపంచ వ్యాప్తంగా భూములను కొనుగోలు చేస్తున్నాయని, తద్వారా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తమ చేతిలోకి తీసుకుంటున్నాయని అన్నారు. పశ్యపద్మ మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలన కంటే కూడా మోడీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. రైతు సమన్వయ సమితి ఏం పని చేస్తుందని ప్రశ్నించారు. రైతు రక్షణ యాత్ర స్ఫూర్తిగా రైతు ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.