Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు నిందితుల అరెస్ట్
- నర్సాపూర్,బాలానగర్‌లో మరో ఇద్దరు
- గ్రేటర్లో ఎక్కడికక్కడ తనిఖీలు
నవతెలంగాణ- జగద్గిరిగుట్ట/మేడ్చల్ రూరల్
మేడ్చల్ జిల్లాలో మొత్త రూ.2 కోట్ల విలువైన 4 కిలోల 926 గ్రామలు డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడుచోట్ల ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. శనివారం కుత్బుల్లాపూర్‌లోని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్యగౌడ్, మేడ్చల్ జిల్లా అధికారి కె.విజరు భాస్కర్లు నిందితులను ప్రవేశపెట్టారు. డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి వివరాలు వెల్లడించారు.విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లి న్యూ బాలాజీనగర్ ఎస్వి సెలక్షన్ అపార్టుమెంట్లో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ ఎస్ఐ సహదేవ్‌తో పాటు జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన పవన్ అలియాస్ చిటుకూరి ప్రశాంత్‌రెడ్డి ఐదు గ్రాముల తెల్లటి పదార్థం మొఫెడ్రోన్ డ్రగ్‌తో పట్టుబడ్డాడు. అతన్ని విచారించగా మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాయిపేటకు చెందిన కన్నారెడ్డి అలియాస్ మహేశ్వర్ కన్నారెడ్డి నుంచి వచ్చిందని చెప్పాడు. బొంగుళూరు గేట్ వద్ద గల గురుదత్త లాడ్జిలో కన్నారెడ్డి ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అతడి నుంచి 921 గ్రాముల డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని బవాజీపల్లి గ్రామానికి చెందిన కొండనూరి రామక్రిష్ణగౌడ్కు నిందితునితో ఫోన్ చేయించి డ్రగ్ కావాలని పిలిపించారు. దాంతో అతను తన కారులో నాలుగు కేజీల డ్రగ్స్‌తో వచ్చాడు. రావడంతోనే అతన్ని పోలీసులు పట్టుకొని కారు, డ్రగ్స్‌ను సీజ్ చేశారు. కాగా ఈ దాడుల్లో మొత్తం 4 కిలోల 926 గ్రాముల డ్రగ్స్ పట్టుబడింది. దాని విలువ సుమారు రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
నర్సాపూర్, బాలానగర్‌లో మరో ఇద్దరు అరెస్ట్
బాలానగర్ ఎస్వోటీ పోలీసులు నర్సాపూర్ చౌరస్తాలో తనిఖీ చేసి ఓ అనుమానితుడిని అరెస్టు చేసి బాలానగర్ పోలీసులకు అప్పగించారు. అతన్ని విచారించగా గంజాయి సేవించినట్టు అంగీకరించాడు. బాలానగర్ సీఐ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్న సయ్యద్ జలాల్ కుత్బుల్లాపూర్‌లోని భవానీనగర్ పరిధి చంద్రగిరినగర్‌లో నివాసముంటున్నాడు. శనివారం బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో గంజాయి తాగుతుండగా ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. 11 గ్రాముల గంజాయి దొరికింది. అతను గంజాయి వాడుతాడని, అంతేకాకుండా గంజాయిని విక్రయించే చిరు వ్యాపారి అని విచారణలో తేలింది. గంజాయి తాగే మరో చిరు వ్యాపారుడు ఎస్.ఆర్.నగర్ బల్కంపేట ప్రాంతానికి చెందిన స్విగ్గీ డెలివరీ బారు షిండే విశాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
డ్రగ్స్ స్మగ్లర్ల ఆటకట్టు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంతో లింకు ఉండి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఎనిమిది మంది స్మగ్లర్లను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి చెన్నై మీదుగా ఆస్ట్రేలియాకు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు ఎన్సీబీకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో నిఘా వేసిన ఎన్సీబీ అధికారులు చెన్నైలో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను సరఫరా చేసే ఈ ముఠా సభ్యులు చీరల మధ్యలో రహస్యంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్‌ను దాచడాన్ని అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ఘటనలో హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు బెంగళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి దేవహళ్లీ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న డ్రగ్స్‌ను మార్గమధ్యంలో అధికారులు కాపు కాసి ఆట కట్టించారు. ఈ సందర్భంగా ఇద్దరు హైదరాబాదీలను అరెస్టు చేసిన అధికారులు.. వారిచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని బెంగళూరులో అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.