Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజురాబాద్‌లో గ్రూపులతో రాజేందర్‌కు తంటాలు
- దళితబంధుతో టీఆర్ఎస్కు లాభం అంతంతమాత్రమే?
- ఇంటెలిజెన్స్ నివేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది. బరిలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి కత్తిమీద సాములా తయారైంది. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన ఎన్నిక ఇదేనంటూ చెబుతున్న వారూ లేకపోలేదు. ఈ ఉప ఎన్నికపై గులాబీ సర్కారు ఓ కన్నేసింది. ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రాజకీయ పార్టీల్లోని అంతర్గత వ్యవహారాలు, ఎన్నిక గురించి ప్రజలేం అనుకుంటున్నారు తదితర అంశాలై ఆరా తీస్తున్నది. ఈ సంందర్భంగా అనేక వినూత్న విషయాలు, భిన్నాంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు సమాచారం. రాజకీయ కప్పగంతుల మూలంగా ఆశించిన ప్రయోజనం టీఆర్ఎస్కు కలగలేదని వినికిడి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు వచ్చిన పాడి కౌశిక్‌రెడ్డితో గులాబీ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రికి పంపిన నివేదికలో స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. కౌశిక్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి ఎన్నికల్లో ఓట్ల పండుగ చేసుకోవాలనుకున్న అధికార పార్టీకి కండ్లు చెదిరే సంగతులు వేగుల ద్వారా అందినట్టు తెలంగాణ భవన్ వర్గాలే సెలవిస్తున్నాయి. అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే సంగతిని వాయిదా వేసినట్టు సమాచారం. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన దళితబంధు పథకంతో అధికార పార్టీ ఓటు బ్యాంక్‌లో అదనంగా వచ్చి చేరే ఒట్లు తక్కువేనని ఇంటెలిజెన్స్ అంటున్నది. దీని అమలుపై ప్రజల్లో అనుమానాలు ఉండటమే కారణమని తమ నివేదికలో పొందుపరిచినట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్ రూమ్ పథకాల అమలు పరిస్థితి కండ్లముందే కనిపిస్తున్న నేపథ్యంలో నమ్మలేని పరిస్థితి ఉందనే సంగతిని సర్కారుకు చేరవేసింది. మరో ముఖ్యమైన విషయం ఈటల రాజేందర్ ఏదైతే ఆశించి బీజేపీలో చేరారో అది నెరవేరకపోవడం గమనార్హం. ఆ పార్టీ పంచనచేరి అదనపు ఓట్లను సాధించడం ద్వారా హుజూరాబాద్‌లో విజయభావుటా ఎగురేయాలని భావించిన ఈ మాజీ మంత్రికి దిమ్మతిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేందర్ వ్యక్తిగత పలుకుబడి మూలానే ఆయనకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది తప్ప, బీజేపీతో కాదని ఇంటెలిజెన్స్ సర్కారుకు పంపిన మరో నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. బీజేపీలో ఉన్న గ్రూపుల మూలంగా రాజేందర్ తల బొప్పికడుతోందని సమాచారం. ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేయడం తప్ప, ఆ పార్టీ నేతల ద్వారా ఈటలకు లబ్ధిచేకూరే పరిస్థితుల్లేవని, ఒకేవెళ ఉన్నా అవి చాలా తక్కువని సర్కారీ వేగుల అభిప్రాయం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు గ్రూపులతో ఈటలకు ప్రచారపర్వం సందర్భంగా ప్రతిరోజూ పరీక్షే అవుతున్నదని సమాచారం. ఒక్కోరోజు బీజేపీ నేతలెవరూ ప్రచారానికి పోవడం లేదని ఈటల వర్గీయులు ఆవేదన, ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి ఎదురవుతున్నది. ఇదిలావుండగా సర్కారీ వేగులు మరో కొత్త ప్రయోగం చేసినట్టు సమాచారం. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పనితీరు, కులాల వారీగా సమీకరణాలు, పార్టీలో ఉండి ఈటల రాజేందర్‌కు సహకరించే వారు ఎవరైనా ఉన్నారా ? వనరులను సక్రమంగా వినియోగిస్తున్నారా ? ప్రచారాన్ని వదిలేసి తిరుగుతున్న నేతల గురించి సైతం ఆరా తీసినట్టు తెలిసింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ సొంత వ్యూహాల కన్నా పార్టీ అధినాయకత్వం ఆదేశాల అమలుకే పరిమితమవుతున్నట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందున్న రాజకీయ పరిస్థితి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అంచనా. అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ తీవ్రమైందనీ, రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవనీ, ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొడంగల్ ఎన్నిక మాదిరిగానే హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఒక్కరోజులోనే ఫలితం మారిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నవారూ లేకపోలేదు.