Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహణకు సర్వంసిద్ధం
- 1,768 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- విధుల్లో 25,258 మంది ఇన్విజిలేటర్లు
- విద్యార్థులు, సిబ్బందికి మాస్క్ తప్పనిసరి
- ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. వచ్చేనెల 3 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు సర్వంసిద్ధం చేశామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4,09,897 మంది రెగ్యులర్, 49,331 మంది ఒకేషనల్
విద్యార్థులు కలిపి 4,59,228 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వివరించారు. వారికోసం కరోనా నేపథ్యంలో1,768 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 389 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 232 గురుకులాలు, 892 ప్రయివేటు జూనియర్ కాలేజీలు, 255 పాఠశాలలున్నాయని అన్నారు. రాష్ట్రంలో 1,768 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,768 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామని చెప్పారు. రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తయిన 25,258 మందిని ఇన్విజిలేటర్లను విధుల్లోకి తీసుకున్నామని అన్నారు. 70 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రమోట్ అయ్యారని చెప్పారు. మార్చిలో జరిగే సెకండియర్ వార్షిక పరీక్షల సమయంలో ఏమైనా ఇబ్బందులొస్తే వారిని ఎలా ఉత్తీర్ణులుగా ప్రకటించాలో అర్థం కాలేదన్నారు. అందుకే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. విద్యార్థులకు సౌలభ్యం కలిగించేందుకు 70 శాతం సిలబస్‌తోనే ప్రశ్నాపత్రాలు సిద్ధం చేశామనీ, 30 నుంచి 40 శాతం చాయిస్‌లను పెంచామని వివరించారు.
పోలీస్స్టేషన్లకు చేరిన ప్రశ్నాపత్రాలు
ప్రతి సబ్జెక్టుకూ మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు తయారు చేశామని జలీల్ చెప్పారు. అవి ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు చేరాయని అన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి, పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు క్లినికల్ సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులను నియమించామని వివరించారు. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అన్నారు. అయితే ఎవరైనా విద్యార్థి మాస్క్ లేకుండా పరీక్షా కేంద్రానికి మాస్క్ ఇచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. పరీక్ష మధ్యలో విద్యార్థులకు అనారోగ్యం వస్తే వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీకి పంపిస్తామన్నారు.
ఒక బెంచీకి ఒక విద్యార్థి మాత్రమే కూర్చుంటారని చెప్పారు. విద్యార్థులు హాల్‌టికెట్లను ఇంట్లో కూర్చొని డౌన్లోడ్ చేసుకోవచ్చనీ, ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం వరకు 4,59,228 మందిలో 3,74,903 మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పరీక్షలు రాసే విద్యార్థులు ఫెయిలైతే మళ్లీ పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివిన చోటే విద్యార్థులు పరీక్షలు రాయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్‌కుమార్, జాయింట్ సెక్రెటరీలు శ్రీనివాస్, భీంసింగ్ తదితరులు పాల్గొన్నారు.