Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల లేమి : సీజేఐ
- నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అథారిటీ ఏర్పాటుచేయాలని ప్రతిపాదన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ, సరైన ప్రణాళిక లేకుండా జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొత్త భవన సముదాయ ప్రారంభోత్సవానికి జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ.. 'చట్టాలతో పాలించే ఏ సమాజానికైనా కోర్టులు అత్యంత కీలకమైనవి. అయితే మనదేశంలో చాలా కోర్టుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవన్నది కఠినమైన వాస్తవం. కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కేవలం 5శాతం కోర్టుల్లోనే మెడికల్ ఎయిడ్ అందుబాటులో ఉంది. 26శాతం కోర్టు భవనాల్లో మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు లేవు. 16శాతం కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. ప్రజలకు న్యాయం అందించాలంటే న్యాయపరమైన మౌలిక సదుపాయాలు కూడా ముఖ్యమే. కానీ దేశంలో వీటి నిర్వహణ, పురోగతి ఏమాత్రం ప్రణాళిక లేకుండా జరుగుతోంది' అని వ్యాఖ్యానించారు. నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనను రానున్న పార్లమెంటు సమావేశాల్లో చేపట్టాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజును కోరానని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఏ సమాజానికైనా కోర్టులు చాలా అవసరమని చెప్పారు.