Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు
- గ్రామ కమిటీల నియామకం
- ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారమే...
- సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఇతరుల నుంచి క్లెయిమ్స్ స్వీకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 8 వరకు వీటిని తీసుకోవాలని చెప్పారు. ఆలోపు వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలనీ, అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. రెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారిని నియమించాలనీ, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. 87 శాతం పోడు భూముల ఆక్రమణ భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ వంటి 12 జిల్లాల్లోనే ఉందని సీఎం అన్నారు. 'పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ - పునరుజ్జీవం, హరితహారం' అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో శనివారం నాడాయన ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని చెప్పారు. అడవి మీద ఆధారపడి బతికే గిరిజనులకు మేలు చేయడంతోపాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అటవీ, పోలీస్ అధికారులను ఆదేశించారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పారు.
గిరిజనేతరులతోనే సమస్య
గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుంచి వచ్చే శక్తులే దాన్ని నాశనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల ప్రజలు అడవికి నష్టం చేయరన్నారు. బయటి శక్తులపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఫారెస్టు లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయించాలని, సాధ్యం కాని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి, వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఫారెస్టు భూములకు శాశ్వత బౌండరీలను ఫిక్స్ చేసి సరిహద్దులకు ప్రొటెక్షన్ ట్రెంచ్ ఏర్పాటు చేసి, ట్రెంచ్ పైన గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ట్రెంచ్ ఏర్పాటు చేయడానికి అటవీ నిధులతో పాటు ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు.
గంజాయి సాగు చేస్తే...: గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతో పాటు, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే ఆర్వోఎఫ్ఆర్ పట్టా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు.
అఖిల పక్షం నిర్వహించాలి
పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్ని జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, ఆ తర్వాత అటవీ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకూడదనే విషయంలో అఖిలపక్ష నాయకుల నుంచి ఏకాభిప్రాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మెన్లు, ఎంపీపీిలు, జెడ్పీటీసీిలు తదితర ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అడవుల రక్షణను ఒక బాధ్యతగా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.