Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూపీసీ జాతీయ సదస్సు డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని అసంఘటితరంగ కార్మికుల సమస్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని వర్కింగ్ పీపుల్స్ చార్టర్ (డబ్ల్యూపీసీ) నెట్వర్క్ జాతీయ సదస్సు డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్లో ఆదివారం డబ్ల్యూపీసీ రెండ్రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. 23 రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ అసంఘటిత సామాజిక భద్రతామండలి చైర్మెన్ దేవేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏడు కీలకాంశాలను గుర్తించారు. ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా అసంఘటితరంగ కార్మికుల ప్రయోజనాలను విస్తరించాలనీ, అధికారిక కార్మికులకు లభించే ప్రయోజనాతో సమానంగా వారికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనీ, సార్వత్రిక సామాజిక రక్షణ దశలను అమలు చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎఫ్‌ను వర్తింపచేయాలనీ, ఇండ్లు నిర్మించి ఇవ్వాలనీ, కార్మిక చట్ట సంస్కరణలు, పరిపాలనను ప్రజాస్వామ్యయుతంగా బలోపేతం చేయాలనే అంశాలను ప్రస్తావించారు. పనికోసం ఇతర ప్రాంతాలకు ప్రజలు వలస వెళ్తున్నారంటే అక్కడి ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైనట్టేనని స్పష్టంచేశారు. కోవిడ్ విపత్కర కాలంలో వారి కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూపీసీ జాతీయ సమన్వయకర్త చందన్‌కుమార్, ప్రొఫెసర్ బాబూమాథ్యూ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు టీ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.