Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిన్నటిదాకా గ్రామ, మండల కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం పేరిట హడావుడి చేసిన అధికార టీఆర్ఎస్.. జిల్లా కమిటీల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. నవంబరు 15న వరంగల్లో నిర్వహించబోయే విజయగర్జన సభ తర్వాత వాటిని వేస్తామంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నప్పటికీ... అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తే అవి మరో అధికార కేంద్రాలుగా మారతాయనే ఆందోళన గులాబీ పెద్దలను వెంటాడుతున్నది. గతంలో టీడీపీ... ఇదే రకమైన అనుభవాన్ని చవి చూసిందనీ, ఆ తర్వాత ఆ పార్టీ చాలా దెబ్బతిన్నదని టీఆర్ఎస్ అగ్రనేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా కమిటీల ఏర్పాటు, అధ్యక్షుల నియామకం తదితరాంశాల జోలికి పోకపోవటమే మంచిదంటూ ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో నేతలు అభిప్రాయపడ్డట్టు వినికిడి. ఈ క్రమంలో ఒకవేళ ఆయా కమిటీలను వేసి, అధ్యక్షులను నియమిస్తే.. జిల్లాల్లో అధ్యక్షులకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య అనేకాంశాల్లో మనస్పర్థలు వచ్చే అవకాశముందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నది. మరో రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలను పెట్టుకుని.. ఇలాంటి లేనిపోని సమస్యలనుకొని తెచ్చుకుంటే అంతిమంగా అది తీరని నష్టాన్ని కలగజేస్తుందని ఓ సీనియర్ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. అందువల్లే ప్రస్తుతానికి జిల్లా కమిటీలు, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పక్కనబెట్టామని ఆయన తెలిపారు. అందువల్ల ప్రస్తుతానికి గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల వరకే పరిమితం కానున్నామని ఆయన వివరించారు. దీంతో జిల్లాల్లో పార్టీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్న నేతల ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. ఈ అంశాలపై మరింత స్పష్టత రావాలంటే వచ్చే నెల 15 వరకూ వేచి చూడాల్సిందే.