Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంపకాల్లో తేడాతో వచ్చిందే హుజూరాబాద్ ఉప ఎన్నిక
- నిజాంలా కేసీఆర్..
- కాసీంరజ్వీలా హరీశ్‌రావు ఆటలు
- రాష్ట్ర పరువు దిగజార్చుతున్న టీఆర్ఎస్, బీజేపీలు
- కరీంనగర్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మరో ఏడాదిన్నర కాలం అధికారంలో ఉండగానే టీఆర్ఎస్లో ముసలం మొదలైందనీ, అభద్రతా భావంతో కేసీఆర్ తమ ఫోన్లను ట్యాప్ చేయడమే కాక, సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఫోన్‌నూ ట్యాప్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిన నిర్బంధాన్ని చూస్తుంటే 'దేవుడా ఎందుకయ్యా.. నక్సలైట్లు లేకుండా చేశావు.. వాళ్లు ఉంటేనన్న పాలకులు భయపడేవాళ్లు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ వచ్చిన ఆయన ఆదివారం స్థానిక మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంపకాల్లో తేడాతో వచ్చిందే హుజురాబాద్ ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోడీ, అమిత్‌షా దోస్తానాతో రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పడమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ప్రతిపక్షాల ఫోన్లే కాకుండా తన ప్రభుత్వంలో ఉన్న నేతలు, పోలీసు, ఇతర విభాగాల అధికారుల ఫోన్లనూ ట్యాప్ చేయడం చూస్తుంటే సీఎం కేసీఆర్ అభద్రతాభావా నికి అద్దం పడుతుందన్నారు. కరీంనగర్‌కు చెందిన రిటైర్డ్ అధికారుల నేతృత్వంలో 30మంది టీం తమ వ్యక్తిగత సమాచారంతోపాటు తమ కుటుంబసభ్యుల వ్యక్తిగత జీవితాల్లోకీ తొంగిచూడటం కేసీఆర్ చిల్లరవ్యక్తిత్వానికి నిదర్శమని అన్నారు. టీఆర్ఎస్లో నిజాంలా కేసీఆర్, కాశీంరజ్వీలా హరీశ్‌రావు చేస్తున్న ఆటలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే ముసలం మొదలైందన్నారు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ఇచ్చిన హామీలు అటకెక్కించారన్నారు. జీహెచ్ఎంసీలో వరదబాధి తులకు రూ.10వేలు ఇస్తానన్న టీఆర్ఎస్, వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు తిరిగి కొనిస్తామని చెప్పిన బీజేపీ చెరో సగం సీట్లు సంపాదించి ఆ ఊసే ఎత్తకపోవడమే నిదర్శమనమన్నారు. హుజూరాబాద్‌లో ఇచ్చే హామీలూ ఫలితాల తర్వాత అలాగే అటకెక్కుతాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన కరీంనగర్ ఎంపీ బండి సంజరుకి ఆయన సొంత జిల్లాలోనే విలువ లేదన్నారు. ఈ జిల్లా నుంచి జాతీయస్థాయిలో ఉన్న మురళీధర్‌రావు పేరుతో కరీంనగర్లో కట్టిన ఫ్లెక్సీల్లో సంజరు ఫొటో రెవెన్యూ స్టాంప్సైజులో ఉందనీ, ఎన్నికల కార్యక్రమ ఫ్లెక్సీలో ఆ సైజు ఫొటో కూడా వాడకపోవడం బండికి ఉన్న విలువేంటో తెలుస్తోందన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.