Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డాగా మారిన ఏజెన్సీ
- కొత్తగూడెం జిల్లా నుంచి కాశ్మీర్ వరకు రవాణా
- పలుమార్లు పట్టుబడినా ఆగని అక్రమ దందా
- రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా సాగు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతం గంజాయికి అడ్డాగా మారింది. కోవిడ్-19 వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాదట్టమైన అటవీప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, ఒడిశాలోని మల్కన్‌గిరి అడవుల్లో యథేచ్ఛగా గంజాయి సాగవుతోంది. పలుమార్లు పోలీసులు గంజాయి సాగు ప్రదేశాలను గుర్తించి మొక్కలను ధ్వంసం చేసిన సందర్భాలున్నాయి. అయితే వీటిని ఎవరు సేద్యం చేస్తున్నారో తెలుసుకోవడంలో మాత్రం పోలీసు యంత్రాంగం విఫలమైందనే చెప్పాలి. అలాగే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో గంజాయి రవాణా అవుతున్న సందర్భాలున్నాయి. ఇలా రవాణా అవుతున్న గంజాయి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అధిక మొత్తంలో పట్టుబడుతోంది. కూరగాయలు, కోడిగుడ్ల బాక్సుల అడుగు భాగాన గంజాయి నిల్వ చేసి సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే లారీ అడుగు భాగంలో సైతం ప్రత్యేకంగా ర్యాక్‌లు ఏర్పాటు చేసి అనుమానం రాకుండా రవాణాచేస్తూ పట్టుబడిన దాఖలాలూ ఉన్నాయి. గంజాయి సరఫరా చేస్తూ లారీలు మొదలు ద్విచక్ర వాహనాల వరకూ పలుమార్లు పోలీసులకు పట్టుబడటంతో సీజ్ చేసిన సందర్భాలున్నాయి.
గంజాయి వనం.. భద్రాద్రి ఏజెన్సీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి గుప్పుమంటోంది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి ప్రారంభం నాటి నుంచి గంజాయి రవాణా ఊపందుకుంది. పోలీసులు కోవిడ్ లాక్డౌన్ విధుల్లో ఉన్న సందర్భాల్లో గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా సాగినట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావిత సమయం 2020-21 దాదాపు రెండేండ్ల కాలంలో భద్రాద్రి జిల్లాలో అత్యధికగంజాయి స్మగ్లింగ్ కేసులు నమోదవడమే దీనికి నిదర్శనం.
ఆ మూడు రాష్ట్రాల నుంచే..
గంజాయి స్మగ్లింగ్‌తో ఆదాయం భారీగా వస్తుండటంతో పలువురు ఇతర వ్యాపారాలను వదిలి ఈ పనిలోనే ఉన్నారు. కొందరు స్మగ్లర్లు జిల్లా నుంచి కశ్మీర్ వరకూ గంజాయి సరఫరా చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అటవీప్రాంతంలో పెద్దమొత్తంలో గంజాయి సాగు చేస్తున్నారు. ఈ రాష్ట్రాలకు భద్రాద్రి జిల్లా సరిహద్దు కావడంతో మార్కెటింగ్ చేసుకునేందుకు స్మగ్లర్లు అడ్డాగా ఎంచుకున్నారు. ఈ జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా.. అటు అశ్వారావుపేట నుంచి కూడా హైదరాబాద్ తరలిస్తున్నారు. అక్కడి నుంచి ముంబయి, ఢిల్లీ, నాగపూర్, కశ్మీర్ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలతో కలిపి అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారు.
రిటైల్‌గానూ అమ్మకాలు..
గంజాయి అక్రమ రవాణాయే అనుకుంటే...రిటైల్ విక్రయాలు సైతం ఊపందుకున్నాయి. గంజాయి స్మగ్లర్లు ఇటీవల రిటైల్ విక్రయాలు సైతం మొదలు పెట్టారు. యువతే లక్ష్యంగా స్థానికంగా మార్కెట్ సృష్టించుకుం టున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు పారిశ్రామిక ప్రాంతంలో రిటైల్‌గా గంజాయి విక్రయాలు సాగించేందుకు కొన్ని ముఠాలు సైతం ఏర్పడినట్టు సమాచారం. అశ్వారావుపేట మండలంలో ఇటీవల రెండు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రావ్యాపారులు స్థానికంగా ఉన్న ఓ మహిళా వీధి వ్యాపారికి దాదాపు రూ.91లక్షల విలువైన గంజాయి అప్పగించారు. ఈమె నుంచి 611.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో భద్రాచలంలో వేర్వేరు ఘటనల్లో రూ.14.6 లక్షల విలువైన 73 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలతో పాటు, కొత్తగూడెం జిల్లాకు చెందిన ముఠాలు ఖమ్మంలో సైతం విక్రయాలు సాగిస్తున్నట్టు వినికిడి. అండర్‌బ్రిడ్జిలు, స్లమ్ ఏరియాల్లో మకాం వేసి గుట్టుచప్పుడు కాకుండా ఖమ్మంలోని వివిధ ప్రాంతాల్లో ఎంచుకున్న కొందరికి గంజాయి సఫ్లరు చేస్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6గంజాయి కేసులు నమోదు కాగా దాదాపు 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకు న్నారు. అలాగే గుట్కా, మాదక ద్రవ్యాల కేసులు 31 నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఉమ్మడి అమ్రాబాద్, పదర మండలాల్లో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. అటవీ సమీప భూము ల్లో మిరప, కంది తదితర పంటలలో గంజాయిని సాగు చేస్తున్నారు వ్యాపారాలకు కేంద్ర బిందువులైన ఈ ప్రాంతాల్లో గంజాయి, గుట్కా వంటి కేసులను నీరు గారుస్తున్నారనే ఆరోప ణలున్నాయి.. గతేడాది గంజాయి సాగు చేసే స్మగ్లర్లు పలుమార్లు పట్టు బడ్డా రు. రెండు నెలల క్రితం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇప్పలపల్లి, బీకే లక్ష్మాపురం గ్రామాల నుంచి కారులో, ద్విచక్రవాహ నాలపై ప్యాకెట్లలో తరలిస్తుండగా 5 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 7గురిపై కేసునమోదు చేశారు. వీరంతాహైదరాబాద్ పరిసర గ్రామాలకు చెంది న ఉన్నత చదువులు చదివిన వారు కావడం విశేషం.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 1256 కిలోల ఎండుగంజాయిని పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.71.5 లక్షలుగా తేల్చారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు 10, 246. వీటి విలువ రూ.30,25,000. విడిగా అమ్ముతున్న ఎండు గంజాయి పొట్లం ఒక్కొక్కటి రూ.400 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సంగారెడ్డి జిల్లా మీదుగా కర్నాటక, మహారాష్ట్రలకు గంజాయి తరలిస్తున్నారు. గంజాయి సాగులేని, గుడుంబా రహిత జిల్లాగా 2015లో సంగారెడ్డిని ప్రకటించినప్పటికీ.. ఇంకా పత్తి, చెరుకు లో అంతరపంటగా గంజాయిని సాగు చేస్తున్నట్టుగా పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు తనిఖీల్లో వెల్లడైంది.
2019 నుంచి 2021 వరకు మూడేండ్లలో గంజాయి కేసుల వివరాలు..
- 2019లో రూ.6.56 కోట్ల విలువ చేసే 3,792 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 35 కేసుల్లో 117 మందిని అదుపులోకి తీసుకున్నారు.
- 2020లో రూ.13.66 కోట్ల విలువ చేసే 9,126 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 69 కేసులు నమోదు చేసి 213 మందిని అదుపులోకి తీసుకున్నారు.
- ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ వరకు రూ.18.54 కోట్ల విలువైన 12,365 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 50 కేసులు నమోదు చేసి 115 మందిని అదుపులోకి తీసుకున్నారు.
విస్తృతంగా దాడులు చేస్తున్నాం..
గతం కంటే ఇప్పుడు ఎక్కువగా దాడులు చేస్తున్నాం. ఈ విస్త్తృత దాడుల ఫలితంగానే గంజాయి పెద్దమొత్తంలో పట్టుబడుతోంది. ఇతర ప్రాంతాల్లో ఈ స్థాయిలో దాడులు చేస్తున్నట్టుగా లేదు. అందుకే కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. జిల్లా మీదుగా రవాణా అవుతున్న గంజాయంతా ఆంధ్రా, ఒడిశా (ఏఓబీ) బార్డర్‌కు చెందినదే. ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భారీగానే వస్తోంది. ఏపీలోని చింతూరు, ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి ఎక్కువగా గంజాయి రవాణా అవుతోంది. స్మగ్లర్లు ఎంత రహస్యంగా సరఫరా చేస్తున్నా పోలీసు యంత్రాంగం కృషి ఫలితంగా భారీగా పట్టుబడుతోంది.
- సునీల్‌దత్, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా