Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోరాహోరీ ప్రచారసభలు, ర్యాలీలు..
- నాలుగు నెలల ప్రలోభాల మధ్య హుజూరాబాద్ ఓటర్లు
- ప్రధాన ఘట్టంగా పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియ
- రెండు రోజుల్లో ముగియనున్న ప్రచారపర్వం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
హుజూరాబాద్ ఉప ఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. నాలుగురోజుల్లో అభ్యర్థుల భవితవ్వం ఈవీఎంలలో భద్రం కాబోనుంది. ప్రచారానికి మరో రెండురోజుల గడువే ఉండటం.. ఇప్పటికీ ఓటరు నాడి అంతుచిక్కకపోవడం వంటి పరిణామాల మధ్య ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌వైపు దృష్టిసారించాయి. ఉప ఎన్నికకు దారి తీసిన రోజు నుంచి నాలుగు నెలలుగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వా.. నేనా.. అన్నరీతిలో తలపడుతూ రాగా కాంగ్రెస్ ఎంట్రీతో మూడు పార్టీల్లో హోరాహోరీ ప్రచారపర్వాన్ని సాగిస్తున్నాయి. ఏదేమైనా ఇరు పార్టీల కోవర్టుల కోర్టులో కొంత గెలుపు ఉండగా.. అసలు జనం నాడి ఎటువైపు ఉందో తెలియని ఉత్కంఠ నెలకొంది. రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్కు.. ఇన్నాళ్లూ ఆ పార్టీలోనే ఉంటూ ఇప్పుడు ప్రత్యర్థిగా మారిన ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. దాంతో ఇదివరకు ఎన్నడూ చూడని స్థాయికి ఆ ఉప ఎన్నికను ఇరువురూ తీసుకెళ్లారు. ప్రలోభాల పర్వంతో మొదలైన వారి ఎత్తుకుపైఎత్తులు.. సొంత పార్టీనేతల, అనుచరుల ఫిరాయింపులు, స్థానిక నేతల కొనుగోళ్లు.. మనీ, మద్యం ప్రవాహం మధ్యన ఆ రెండు పార్టీల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఈటల రాజీనామా రోజు నుంచే అధికారపార్టీ పెద్దఎత్తునే అంగ, అర్థబలాన్ని రంగంలోకి దింపి కేంద్రీకరించింది. అదే సమయంలో ఇన్నాళ్లూ వెంట ఉన్న కేడర్‌ను ఈటల 'నయానో.. బయానో' ఇచ్చి కొందరిని తన వెంటే ఉండేలా కాపాడుకున్నాడు. ప్రత్యర్థులిద్దరూ గతంలో ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక నేతలకు, గల్లీ లీడర్లకు మంచి బేరం కుదిరినట్టయింది. వాళ్లు ఈటల వైపు ఉంటారా? అధికారపార్టీని పట్టుకునే ఉంటారా? అన్న ఉత్కంఠ నడుమ కొనుగోళ్ల పర్వం తారాస్థాయికే చేరింది. చివరికి కోవర్టుల పుట్టుకకు దారి తీసింది. ఇది అటు ఈటల కోటను కూల్చనుందా? ఇటు అధికాపార్టీ కోటకు బీటలు తేనుందా? వేచిచూడాల్సిందే!
పైకి గులాబీ కండువా.. లోన రాజేందర్ భజన..
గెలుపే ధ్యేయంగా ఈటల రాజేందర్ బృందం నెల కిందటే పావులు కదిలిపింది. స్థానిక టీఆర్ఎస్ లీడర్లు, గతంలో కుడిభుజంగా ఉన్న నేతలతో రహస్య మంతనాలు చేసినట్టు ప్రచారం ఉంది. పెద్దమొత్తంలోనే నగదు, నజరానాలు ముట్టజెప్పి కోవర్టులను రంగంలోకి దింపినట్టు గుసగుసలు వినిపిస్తోంది. అయితే పెద్దఎత్తునే కొందరు పైకి గులాబీ కండువాలు కప్పుకుని.. లోజన రాజేందర్ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారన్న వాదనా లేకపోలేదు. ఇప్పటికే మొన్నటి దసరాకు మూడు, నాలుగు ఇండ్లకు కలిపి ఓ మేక, లేదా గొర్రె, విచ్ఛలవిడిగా మద్యం సిసాలనూ పంచినట్టు ఆరోపణలు ఉన్నాయి. కమలం గుర్తుతో ఉన్న గడియారాలు, కుట్టుమిషన్లు, కీ చెయిన్లు ఇలా.. ప్రచార సరంజామాను పెద్దఎత్తునే ప్రజలకు అందించినట్టు సమాచారం. ఏదేమైనా అధికారపార్టీతో పోటీగా తాము ఓట్లను కొనుక్కోక తప్పదంటూ ఓ నేత 'నవతెలంగాణ'తో మాట్లాడటం గమనార్హం.
మినిమం వెయ్యి.. ఆపై రూ.5వేలపైనే..
ఏ ఎన్నిక వచ్చినా ప్రచారం ముగిసి పోలింగ్‌కు మిగిలిన సమయంలోనే ఎవరు ఎక్కువగా పోల్మేనేజ్మెంట్ చేస్తారో.. ఓటరు మొగ్గు అటువైపుగా ఉంటుందనేది వాస్తవ పరిస్థితులను చూస్తూ వస్తున్నాం. ఈ సంస్కృతి 2008కంటే ముందు నుంచే బలపడుతూ వచ్చింది. సర్పంచ్ ఎన్నికలు అయినా, ఇతర కార్పొరేషన్, మున్సిపల్ఎన్నికలు అయినా చివరి దశలో పంచే నగదు, ఇచ్చే నజరానాలే ఓటరును తీవ్ర ప్రభావం చేస్తాయి. అన్ని రోజులూ హోరాహోరీ ప్రచార ప్రసంగాలు, నేతలు ఇచ్చే హామీలు నమ్మేవాళ్లలో కొందరు ఈ పోల్మేనేజ్మెంట్లో మనసు మార్చుకునే అవకాశాలు ఎక్కువే. ఓటుకు వంద, క్వార్టర్ సీసాతో మొదలైన ఈ ప్రక్రియ మొన్నటి 2018 ఎన్నికల నాటికి కనీసం రూ.వెయ్యి ఇస్తేనే ఓటరు మొగ్గుచూపుతారనే అభిప్రాయంలో ఆయా పార్టీలు ఉండేవి. అసలే ఉప ఎన్నిక.. రాష్ట్ర చూపు అంతా ఇక్కడే ఉండటం.. ప్రధాన పార్టీలు ఎలాగైనా ఆ సీటు దక్కించుకోవాలన్న పట్టుదలో ప్రధానపార్టీలు కనీసంగా రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంచే అవకాశాలు లేకపోలేదని హుజూరాబాద్ పరిస్థితులు గమనిస్తే అవగతం అవుతోంది.