Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ సహాయంపై ప్రజల్లో అహగాహన పెరగాలి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు లలిత్
- సంగారెడ్డిలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు
నవ తెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/ కంది
దేశంలోని ప్రతి గ్రామానికీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నాల్సా) విస్తరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, పాన్ ఇండియా అవేర్నెస్, అవుట్ రీచ్ క్యాంపెయిన్లో భాగంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని గోకుల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్.. నాల్సాకు సంబంధించిన తెలుగు అనువాద పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం సత్వర న్యాయం పేరుతో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో డి. సాయి ప్రసాద్ దర్శకత్వం వహించిన ప్రత్యేక పాటను ఆవిష్కరించారు. బాధితులకు సత్వర న్యాయం, నాల్సా చేపట్టిన పథకాలను పాట రూపంలో వెలిబుచ్చారు. అనంతరం జస్టిస్ లలిత్ మాట్లాడుతూ.. న్యాయ సేవలకు అర్హులైన కక్షిదారులకు పైసా ఖర్చు లేకుండా ఉచిత న్యాయ సహాయం అందాలన్నదే న్యాయ సేవా అధికార సంస్థ ముఖ్య ఉద్దేశమనీ, దానిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. న్యాయవాదులూ తమ నాణ్యమైన, శ్రేష్టమైన ఉచిత న్యాయ సహాయాన్ని పేదవారికి అందించాలని కోరారు. అలాగే, ఆయన ఆవిష్కరించిన పాటలోని రెండు సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక అడ్వకేట్ క్లైంట్ నుంచి డబ్బులు తీసుకుంటున్న క్రమంలో ఓ మహిళ అక్కడకొచ్చి.. ఆ డబ్బును న్యాయవాది నుంచి తిరిగి క్లైంట్కి ఇచ్చే సీన్.. న్యాయ సేవాధికార సంస్థ పనితీరుకు అద్దం పట్టిందన్నారు. యాసిడ్ దాడిలో గాయపడిన బాధితురాలికి లీగర్ సర్వీసెస్ అథారిటీ ఇచ్చిన భరోసాను పాటలో చాలా అందంగా తీర్చిదిద్దారని కొనియా డారు. ఈరెండు సీన్లను వీలైతే అన్ని భాషలకు తర్జుమా చేయాలని కోరారు. అనంతరం పలు కార్యక్రమాలను ప్రారంభించారు. పద్మమ్మ అనే మహిళ వారసత్వ ఆస్తి సెటిల్మెంట్కు సంబంధించి రూ. కోటి చెక్కును సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. జిల్లా మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రూ.15.16 లక్షల విలువ గల 12 రెట్రో ఫిట్టెడ్ స్కూటీలను లబ్దిదారులకు అందజేసి జెండా ఊపి ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాల చెక్కులను లబ్ది దారులకు అందజేశారు. చివరగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ పాపిరెడ్డి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఉజ్జాల్ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తి టి. వినోద్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ. అభిషేక్ రెడ్డి, హైకోర్టు జడ్జి శ్రీదేవి, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై. రేణుక, ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్లు, అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.