Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2001 నుంచి నిలిపివేత
- తలనొప్పి మాకెందుకని తప్పించుకున్న వీసీలు
- గతంలో దేశ అధ్యక్షులకు డాక్టరేట్స్ ప్రదానం చేసిన ఓయూ
నవతెలంగాణ-ఓయూ
వివిధ రంగాల్లో దేశ, విదేశాల్లో విశిష్టమైన సేవలు, సమాజాభివృద్ధి, శ్రేయస్సు కోసం తమవంతుపాటుపడిన వ్యక్తుల సేవల గుర్తింపుగా 1917 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవం సమయంలో గౌరవ డాక్టరేట్స్ ప్రదానం చేసింది. 2001 వరకు 47 మంది దేశ, విదేశాలకు చెందిన లెజెండ్స్‌కు గౌరవ డాక్టరేట్స్ ఇచ్చి సత్కరించింది. అయితే 2001 నుంచి ఎవరికీ కూడా గౌర వ డాక్టరేట్స్ ఇవ్వకుండా ఓయూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈనెల 27న ఓయూలో జరిగే 81వ స్నాతకోత్సవంలోనైనా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు.
ఇప్పటివరకు 47 మందికి..
1917 నుంచి 2001 వరకు 104 ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో దేశ విదేశాల్లో విశిష్ట సేవలు అందించిన 47 మంది ప్రముఖులకు గౌరవ డాక్టరేట్స్ అందజేశారు. వారిలో ప్రధానంగా రవీంద్రనాథ్ ఠాగూర్, డా||బీఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని నెహ్రు, పాలస్తీనా మాజీ అధ్యక్షులు యాసర్ ఆరాఫత్, డా||మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతులు డా||సర్వేపల్లి రాధాకృష్ణ, బాబు రాజేంద్రప్రసాద్ వంటి ఉద్దండులైన 47 మందికి అందించిన ఘనత యూనివర్సిటీకి ఉంది.
మరి ఇప్పుడు ఏమయ్యింది..?
వ్యక్తుల సేవలను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్స్ ఇచ్చి అటు వారిని గౌరవిస్తూ, ఇటు యూనివర్సిటీ ఉన్నతిని పెంపొందించిన అధికారులు 2001 నుంచి ఎందుకు వీటిని ఇవ్వడం లేదో అర్ధం కాని దుస్థితి నెలకొంది. కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మళ్లీ ఈ సంప్రదాయం పునఃప్రారంభం చేస్తారని అందరూ భావించారు. కానీ ఆదిశగా ప్రయత్నాలను అధికారులు చేయలేదు.
రాజకీయ జోక్యమే కారణం..!
ఇందులో రాజకీయ పార్టీల నేతల జోక్యం పెరిగిందనీ, మాకెందుకు ఈ తలనొప్పి అంటూ నాటి వీసీలు గౌరవ డాక్టరేట్స్ ఇవ్వకుండా తమ టర్మ్ పూర్తి చేసుకొని చేతులు దులుపుకొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓయూను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో వీసీగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్‌ను నియమించింది. ఆయన కూడా ఈ గౌరవ డాక్టరేట్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని దేశ విదేశాల్లో అర్హులైన, అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేసి వారి సేవలు గుర్తించాలని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.