Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభంలోనే అధ్యక్షుడిగా కేసీఆర్ పేరు ప్రకటన
- మొత్తం ఏడు తీర్మానాలు
- హుజూరాబాదే టార్గెట్
- నేడు హైటెక్ సిటీలో టీఆర్ఎస్ ప్లీనరీ
- మూడేండ్ల గ్యాప్ తర్వాత నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇరవై ఏండ్ల ప్రస్థానం 60లక్షల మంది సభ్యత్వం ఇదీ తమ పార్టీ గురించి టీఆర్ఎస్ నేతలు ఘనంగా చెప్పుకునే మాటలు. అలాంటి గులాబీ పార్టీ మూడేండ్ల గ్యాప్ తర్వాత ఇప్పు డు ప్లీనరీని నిర్వహించుకోబోతున్నది. సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి హైదరాబాద్లోని హైటెక్ సిటీలోగల హెచ్ఐసీసీ వేదికైంది. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను పది రోజుల ముందు నుంచే ప్రారంభించారు. ఆదివారం ఉదయానికి అవి పూర్తయ్యాయి. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2018లో చివరిసారిగా కొంపల్లిలో ప్లీనరీ నిర్వహించారు. ఆ తర్వాత 2019లో లోక్సభ ఎన్నికలు, 2020లో కరోనా కారణంగా రద్దు చేశారు. సోమవారం ప్లీనరీ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్లీనరీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. 20 ఏండ్లలో ఉమ్మడి రాష్ట్రంలో (13 ఏండ్ల కాలంలో) టీఆర్ఎస్ చవిచూసిన ఎత్తుపల్లాలు, ఎదిగిన తీరు, అనంతరం గత ఏడేండ్లలో ప్రభుత్వపరంగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల తీరు తెన్నులను ఆయన ఏకరువు పెట్టనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికే లక్ష్యంగా కేసీఆర్ ప్రసం గం కొనసాగనుంది. ఇవే అంశాలపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ అంశాలపై ఏడు తీర్మా నాలను ప్రతిపాదిస్తారు. భోజన విరామానంతరం వీటిని చర్చించి.. ఆమోది స్తారు. ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు వస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు కార్యక్రమ వేదిక, ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్నీ గులాబీ మయమయ్యాయి. హైదరాబాద్ మొత్తం టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,500 మంది ప్రజా ప్రతినిధులు ప్లీనరీకి హాజరు కాబోతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీ చైర్మెన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు అందర్నీ ఈ మీటింగ్కు ఆహ్వానించారు.